Gautam Gambhir: సరిగ్గా ఆడకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి: గంభీర్

Gautam Gambhir Reacts to Indias Loss Against South Africa
  • ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా ఘోర పరాజయం
  • తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
  • పిచ్ బాగానే ఉందన్న గంభీర్
  • ఆటగాళ్ల టెక్నిక్కే సరిగాలేదని విశ్లేషణ
ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఓటమికి పిచ్‌ను కారణంగా చూపడాన్ని పూర్తిగా తోసిపుచ్చాడు. అసలు తప్పు పిచ్‌ది కాదని, భారత బ్యాటర్ల వైఫల్యమే ఓటమి కారణం అని స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడుతూ, జట్టు ఓటమిపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తాము ఎలాంటి పిచ్ కావాలని కోరామో, క్యురేటర్ సరిగ్గా అలాంటి పిచ్‌నే తయారు చేశాడని, అందుకు తాము సంతోషంగా ఉన్నామని తెలిపాడు.

"మేం అడిగిన పిచ్ ఇదే. మాకు లభించిన వికెట్‌తో మేం సంతృప్తిగా ఉన్నాం. క్యురేటర్ మాకు చాలా సహాయం చేశాడు. ఇలాంటి పిచ్‌పై సరిగ్గా ఆడకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇది ఆటకు పనికిరాని వికెట్ ఏమీ కాదు. ఆటగాళ్ల టెక్నిక్, టెంపర్మెంట్‌ను పరీక్షించే వికెట్ ఇది. పటిష్టమైన డిఫెన్స్ ఉంటే ఇలాంటి పిచ్‌లపై కూడా పరుగులు సాధించవచ్చు" అని గంభీర్ విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"నా అభిప్రాయం ప్రకారం 123 పరుగులు సులభంగా ఛేదించాల్సిన లక్ష్యమే. పరుగులు చేయాలంటే సరైన మానసిక దృక్పథం ఉండాలి. సరిగ్గా ఆడనప్పుడు ఇలాంటి పరాజయాలు తప్పవు. ఈ పిచ్ లో ఎలాంటి దెయ్యాలు లేవు. అక్షర్ పటేల్, టెంబా బవుమా పరుగులు చేశారు కదా? అలాంటప్పుడు మన జట్టులోని మిగతా బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారు?" అని గంభీర్ ప్రశ్నించాడు. ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్లలో మానసిక స్థైర్యం లోపించడమేనని తేల్చిచెప్పాడు.

ఈ వికెట్‌పై ఎక్కువగా సీమర్లే వికెట్లు పడగొట్టారని గుర్తుచేశారు. ఇది కేవలం స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ కాదని, ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని, నిలకడను సవాలు చేసే వికెట్ అని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, టెంబా బవుమా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో ఆడారని, మిగతావారు ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయారని గంభీర్ చురకలంటించాడు. అంతిమంగా, పిచ్‌పై నిందలు వేయకుండా, బ్యాటింగ్ వైఫల్యాలను అంగీకరించి, వాటిని సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
Gautam Gambhir
India vs South Africa
Eden Gardens
Cricket
Cricket Match
Batting Failure
Pitch Report
T20 Cricket
K L Rahul
Temba Bavuma

More Telugu News