Srinagar blast: ఈ పూటకు ఇక వెళ్లొద్దులే నాన్నా అన్నా వినలేదు.. పేలుడులో మృత్యువాత పడ్డాడు

Srinagar Blast Tailor Mohammed Shafi Killed Despite Daughters Request
  • నౌగామ్ పోలీస్ స్టేషన్ లో మరణించిన టైలర్ కుటుంబ సభ్యుల ఆవేదన
  • పేలుడు పదార్థాల పరిశీలనలో సాయం కోసం వెళ్లిన టైలర్
  • ప్రమాదవశాత్తూ పేలడంతో దుర్మరణం
శ్రీనగర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడు కారణంగా తొమ్మిది మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పోలీసులకు సాయంగా వెళ్లిన స్థానిక టైలర్ మహమ్మద్ షఫీ (57) కూడా ఈ పేలుడులో మరణించారు. స్థానికంగా టైలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే షఫీ.. తరచుగా పోలీసులకు సాయం చేస్తూ అదనంగా కొంత మొత్తం సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాల పరిశీలనకు ఫోరెన్సిక్ నిపుణులు నౌగామ్ పోలీస్ స్టేషన్ కు రాగా పోలీసులు షఫీని పిలిపించారు.

శుక్రవారం ఉదయమే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన షఫీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి నమాజ్ చేసి తిరిగి వెళ్లారు. రాత్రి భోజనానికి వచ్చిన షఫీ మరోమారు వెళుతుంటే ఆయన కూతురు అభ్యంతరం చెప్పింది. ‘ఈ పూటకు ఇక వెళ్లొద్దు. ఇంట్లోనే ఉండిపో నాన్నా’ అంటూ అడ్డుకుంది. అయినా ఇంకొంచెం పని మిగిలిపోయింది అది పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తానని చెప్పి షఫీ వెళ్లిపోయారని ఆయన కుటుంబం పేర్కొంది.

ఆ తర్వాత కాసేపటికే భారీ పేలుడు శబ్దం వినిపించిందని, పోలీస్ స్టేషన్ పేలిపోయిందనే సమాచారంతో తామంతా అక్కడికి వెళ్లగా బూడిద కుప్ప కనిపించిందని కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇక వెళ్లొద్దు నాన్నా’ అంటూ బిడ్డ ఆపినప్పుడు షఫీ ఇంట్లోనే ఉండిపోతే ప్రాణాలతో మిగిలిపోయేవాడని అన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.
Srinagar blast
Nowgam police station
Jammu Kashmir explosion
Mohammed Shafi
Forensic experts
Tailor death
Explosion incident
Ex gratia
Kashmir news
Police station blast

More Telugu News