Kalvakuntla Kavitha: కవిత లిక్కర్ స్కాం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది: నిప్పులు చెరిగిన మెదక్ బీఆర్ఎస్ నాయకులు

Kalvakuntla Kavithas Liquor Scam Damaged BRS Says Medak Leaders
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కవిత చేసిన ట్వీట్‌పై ఆగ్రహం
  • కొరవి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపాటు
  • మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మీడియా సమావేశం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత లిక్కర్ స్కాంకు పాల్పడటం వల్ల బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు ఆరోపించారు.

ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కవిత చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఈ ఫలితాల అనంతరం రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోందని, అందులో ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు కవిత అని ఆయన అన్నారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. పదవులు ఇచ్చిన కన్నతల్లి వంటి పార్టీ మీద, కన్న తండ్రిపై విమర్శలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఆమె మాటలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. కవితతో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియాలని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కవిత చేసిన ట్వీట్ సరికాదని ఆయన స్పష్టం చేశారు.

కవిత చేసిన అవినీతి, అడ్డమైన దందాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన అన్నారు. ఆమె బంగారం దుకాణాలలోకి వెళ్లి కూడా బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. 2019లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దాదాపు 100 స్థానాలు గెలిస్తే, నిజామాబాద్ పార్లమెంటులో మాత్రం ఆమె ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్, హరీశ్ రావును విమర్శించేందుకు మెదక్ జిల్లాకు రావాలా అని ఆయన ప్రశ్నించారు.

అక్రమ దందాలు, లిక్కర్ దందాలు చేసి బీఆర్ఎస్ పార్టీని కవిత భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కవితనే కారణమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం కవిత ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అసలు కవిత ఎవరిపై పోరాటం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థతను, తప్పిదాలను ఎత్తి చూపాల్సింది పోయి బతిమాలుతున్నట్లుగా మాట్లాడటం ఏమిటని ఆయన నిలదీశారు.
Kalvakuntla Kavitha
Kavitha liquor scam
BRS party
Telangana Jagruthi
Medak BRS leaders

More Telugu News