Nalin Prabhat: నౌగామ్‌లో పేలుడు ఉగ్రకుట్ర కాదు.. ప్రమాదమే: జమ్ముకశ్మీర్ డీజీపీ

Nalin Prabhat Jammu Kashmir DGP Clarifies Nowgam Explosion Was Accident Not Terrorist Plot
  • శాంపిల్స్ తీస్తుండగా భారీ విస్పోటనం
  • ఈ దాడి తమ పనేనని ప్రకటించిన జైషేకు చెందిన అనుబంధ సంస్థ
  • ఉగ్రవాద సంస్థ ప్రకటనను ఖండించిన డీజీపీ
జమ్ము కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో సంభవించిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉందన్న ప్రచారంపై రాష్ట్ర డీజీపీ నళిన్ ప్రభాత్ స్పందించారు. ఉగ్రవాద కుట్ర ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని ఆయన వెల్లడించారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను ఛేదించిన అధికారులు, అక్కడి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి నుంచి నమూనాలు (శాంపిల్స్) సేకరిస్తుండగా భారీ విస్ఫోటనం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావించినప్పటికీ, జైషేకు అనుబంధ సంస్థ అయిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ఈ దాడి తమ పనేనని ప్రకటించింది. అయితే డీజీపీ దీనిని ఖండించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని స్పష్టం చేశారు.

డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, ఫరీదాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించేందుకు సిద్ధం చేశామన్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు పేలుడు సంభవించిందని తెలిపారు. మృతి చెందిన తొమ్మిది మందిలో ముగ్గురు ఫోరెన్సిక్ సిబ్బంది, రాష్ట్ర వైద్య సంస్థకు చెందిన ఒకరు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక టైలర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 32 మంది గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా దెబ్బతిన్నదని, సమీపంలోని భవనాలు కూడా ప్రభావితమయ్యాయని ఆయన తెలిపారు.

నౌగామ్‌ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని పేర్కొంది. నౌగామ్‌ పేలుడుపై మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (జమ్ము కశ్మీర్ డివిజన్) ప్రశాంత్ లోఖండే మాట్లాడుతూ, పేలుడు కారణంగా పోలీస్ స్టేషన్ భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
Nalin Prabhat
Jammu Kashmir
Nowgam
Police Station
Explosion
Faridabad
Forensic

More Telugu News