Satish Kumar Yadav: ఆ నియోజకవర్గాల్లో 27 ఓట్లతో జేడీయూ అభ్యర్థి... 30 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి గెలుపు

Satish Kumar Yadav Wins Bihar Seat by 30 Votes
  • మూడు స్థానాల్లో 100 లోపు ఓట్లతో విజయం సాధించిన అభ్యర్థులు
  • 192 స్థానాల్లో పోటీ చేస్తే ఒకేచోట గెలిచిన బీఎస్పీ
  • ఆ ఒక్కచోట కూడా కేవలం 30 ఓట్ల ఆధిక్యంతో విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలు నియోజకవర్గాల్లో పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగి అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారు. మూడు స్థానాల్లో అభ్యర్థులు 100 లోపు మెజార్టీతో విజయం సాధించడం విశేషం. రాష్ట్రంలో బీఎస్పీ గెలుచుకున్న ఏకైక సీటు కూడా కేవలం 30 ఓట్లతో గెలవడం గమనార్హం.

243 స్థానాలున్న బీహార్‌లో బీఎస్పీ 192 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. రామ్‌గడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సతీశ్ కుమార్ యాదవ్ తన సమీప బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌పై 30 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. సతీశ్ కుమార్ యాదవ్‌కు 72,689 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 72,659 ఓట్లు వచ్చాయి.

భోజ్‌పురి జిల్లాలోని సందేశ్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి రాధాచరణ్ షా సమీప ఆర్జేడీ అభ్యర్థి దీపుసింగ్‌పై 27 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అగియాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేశ్ పాశ్వాన్ సమీప సీపీఐ(ఎంఎల్) అభ్యర్థి శివప్రకాశ్ రంజన్‌పై 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నబీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి చేతన్ ఆనంద్ 112 ఓట్ల మెజార్టీతో ఆర్జేడీ అభ్యర్థి ఆమోద్ కుమార్ సింగ్‌పై గెలుపొందారు.

ధాకా నియోజకవర్గం స్థానాన్ని ఆర్జేడీ అభ్యర్థి పైసల్ రెహమాన్ గెలుచుకున్నారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ జైస్వాల్ 178 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఫోర్బస్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిస్వాన్ 221 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌పై విజయం సాధించారు.
Satish Kumar Yadav
Bihar Election Results
BSP
JDU
BJP
RJD
Close Victory
Low Margin

More Telugu News