Vizianagaram fire accident: కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు.. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం

Crow causes major fire accident in Vizianagaram Konuru village
  • కార్తిక దీపాన్ని ఎత్తుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి
  • తాటాకు ఇల్లు కావడంతో ఎగసిపడ్డ మంటలు
  • పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు కూడా దగ్ధం
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు. కార్తిక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది. అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది. ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండడం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఆలోపే నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిది. ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేసి తెచ్చాడు. ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లోని అర తులం బంగారం కూడా ఈ మంటలకు బూడిదైందని వాపోయాడు. కాగా, తహసీల్దారు సీహెచ్‌ బంగార్రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి, సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
Vizianagaram fire accident
Andhra Pradesh fire
fire accident
Konuru village
thatched houses
Karthika Masam
fire damage
Namburi Gopi
agricultural loss
Tahsildar Bangarraju

More Telugu News