Ayyanna Patrudu: విశాఖలో టూరిజం పెరగాలంటే ఆంక్షలు ఎత్తివేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Remarks on Tourism Spark Debate
  • విశాఖలో టూరిజం అభివృద్ధిపై స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు
  • రాత్రి 10 దాటితే బీచ్‍లో పోలీసు కేసులేంటని ఆగ్రహం
  • రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యన్న
  • గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని విమర్శ
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య 
"రాత్రి 10 గంటలకు బీచ్‌లో ఉంటే పోలీసులు కేసులు పెడితే టూరిస్టులు ఎలా వస్తారు? కుటుంబంతో వచ్చిన వారు ప్రశాంతంగా గడిపే వాతావరణం ఉండాలి."  అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆంక్షలను సడలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

విశాఖలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే గోవాలా 'ఫ్రీ జోన్'గా మార్చాలని ఆయన సూచించారు. "కుటుంబంతో కలిసి పర్యాటకులు సముద్ర తీరానికి వస్తారు. అక్కడ సరదాగా గడపాలి. రాత్రి 10 గంటలు దాటితే బీచ్‌లో ఉన్నవారిపై పోలీసులు కేసులు పెడితే పర్యాటకులు ఎలా వస్తారు?" అని ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డెవలపర్లు చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఇలాంటి వాటిని అరికట్టాలని, లేదంటే తాను స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో చీకటి రోజులు నడిచాయని, ఆ గందరగోళంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Ayyanna Patrudu
Andhra Pradesh Tourism
Visakhapatnam
Tourism Development
Real Estate Andhra Pradesh
AP Speaker
Goa Tourism
Illegal Layouts
Chandra Babu Naidu
AP Development

More Telugu News