Pawan Kalyan: అప్పినపల్లి గ్రామస్తులను అభినందించిన పవన్ కల్యాణ్ .. ఎందుకంటే ..?

Pawan Kalyan Appreciates Appinapalli Villagers for Stopping Smuggling
  • ఎర్రచందనం స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు
  • అప్పినపల్లి ప్రజల ధైర్యాన్ని మెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 
  • పవన్ స్ఫూర్తితోనే స్మగ్లర్లను అడ్డుకున్నామన్న స్థానికులు
  • వాహనం నుంచి 10 ఎర్రచందనం దుంగల స్వాధీనం
  • అటవీ, పోలీస్ సిబ్బందిని కూడా అభినందించిన పవన్
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సామాన్య ప్రజలు చూపిన చొరవను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని వెంబడించి పట్టుకున్న చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తుల ధైర్యాన్ని ఆయన కొనియాడారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే తాము స్మగ్లర్లను ఎదుర్కొన్నామని గ్రామస్తులు చెప్పడం విశేషం. ఈ వివరాలను పవన్ కల్యాణ్  తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
 
తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పులిచర్ల వద్ద తనిఖీలు చేస్తుండగా, ఓ టవెరా వాహనం అనుమానాస్పదంగా వేగంగా దూసుకుపోయింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే స్మగ్లర్లు బెంగళూరు వైపు వేగంగా వెళ్తూ మార్గమధ్యంలో ఇద్దరు వాహనం నుంచి దూకి పరారయ్యారు. డ్రైవర్ ఒక్కడే వాహనాన్ని నడుపుకుంటూ ముందుకు సాగాడు.
 
వెంటనే అటవీ శాఖ అధికారులు అప్పినపల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు ఏకమై ఆ వాహనాన్ని వెంబడించారు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ, పోలీస్ అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించిన అప్పినపల్లి గ్రామస్తులతో పాటు, విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించిన అటవీ, పోలీస్ శాఖ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
Pawan Kalyan
Appinapalli
red sandalwood smuggling
Chittoor district
Andhra Pradesh
smugglers arrest
forest officials
Tirupati flying squad
Pulicherla
red sanders

More Telugu News