Andhra Pradesh Investments: విశాఖ సదస్సు బిగ్ హిట్... ఏపీకి రూ. 11.91 లక్షల కోట్ల పెట్టుబడులు!

Andhra Pradesh Investments Visakha Summit a Big Hit
  • విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం
  • రాష్ట్రానికి రూ. 11.91 లక్షల కోట్ల పెట్టుబడులు
  • మొత్తం 400 ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం
  • 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
  • అంచనాలకు మించి తరలివచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు
  • ఇంధనం, ఐటీ, పరిశ్రమల రంగాల్లో కీలక ఎంఓయూలు
విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. మొత్తం 400 అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) ద్వారా సుమారు రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది.

ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 13,32,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

సదస్సు ప్రారంభమైన తొలిరోజే రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక రెండో రోజు ముఖ్యమంత్రి సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్లు, ఇతర మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాల ద్వారా రూ. 8.41 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఇంధనం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు-వాణిజ్యం, ఏపీ సీఆర్డీఏ, మున్సిపల్ శాఖల పరిధిలో ఈ కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సు విజయవంతం కావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 400 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు జరిగిన ఒప్పందాల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 13,32,445 ఉద్యోగాలపై హామీ పొందింది. ఇవీ గత రెండు రోజులుగా వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల విలువ. 

మొత్తంగా 7 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు - వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజునే బిగ్ హిట్ అయింది. ప్రభుత్వ అంచనాలకు మించి పరిశ్రమలు స్పందించాయి. మొత్తంగా 410 ఎంఓయూల ద్వారా రూ. 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే ఆ అంచనాలకు మించి పారిశ్రామిక వేత్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున పెట్టుబడులు రాగా సదస్సు రెండో రోజున అంతకు మించిన స్పందన కన్పించింది. సదస్సు తొలి రోజైన శుక్రవారం నాడు 365 ఎంఓయూలు కుదుర్చుకోగా... వీటి ద్వారా రూ. 8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే ఈ ఎంఓయూల ద్వారా 12,05,175 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది. 

ముఖ్యమంత్రి సమక్షంలో...

భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ. 7,15,490 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,42,761 మంది ఉద్యోగాలకు హామీ పొందింది రాష్ట్ర ప్రభుత్వం. భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే.. శక్రవారం కూడా దాదాపు అదే స్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. 

శుక్రవారం సీఎం సమక్షంలో ఎంఓయూలు  చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జేఎం బాక్సీ, శ్రీ సిమెంట్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, టాటా పవర్, పతంజలి ఫుడ్, ఇండస్ కాఫీ, కెల్లాగ్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. 

ఇక విడివిడి భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబుడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు ఆసాంతం వివరిస్తూ... పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. వీటితో పాటు.. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే.. వాటిని కూడా వచ్చేలా తాము సహకరిస్తామని సీఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. భాగస్వామ్య సదస్సు తొలిరోజు జరిగిన ఒప్పందాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధనరెడ్డి, సీఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రుల సమక్షంలోనూ భారీగా ఒప్పందాలు...

ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలి రోజున భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుని భారీ పెట్టుబడులను రాబట్టారు. మంత్రులందరూ కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ. 4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేశ్, టీజీ భరత్, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ ఉన్నారు. నారా లోకేశ్ రూ. 1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా... మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారు.

రెండు రోజుల్లో రంగాల వారీ పెట్టుబడి వివరాలిలా...

విద్యుత్ – రూ. 5,11,502 కోట్ల పెట్టుబడులు – 245222 మందికి ఉద్యోగాలు
ఐఅండ్ఐ – రూ. 2,05,008 కోట్ల పెట్టుబడులు – 3,05,574 మందికి ఉద్యోగాలు
సీఆర్డీఏ – రూ. 50,511 కోట్ల పెట్టుబడులు – 42,225 మందికి ఉద్యోగాలు
మున్సిపల్ – రూ. 4,944 కోట్ల పెట్టుబడులు – 12,150 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్ – రూ. 13,009 కోట్ల పెట్టుబడులు – 47,390 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు – వాణిజ్యం – రూ. 2,68,248 కోట్ల పెట్టుబడులు – 4,23,869 మందికి ఉద్యోగాలు
ఐటీ – రూ. 1,38,752 కోట్ల పెట్టుబడులు – 2,56,015 మందికి ఉద్యోగాలు.
Andhra Pradesh Investments
Visakha Summit
AP Investments
CII Partnership Summit
Andhra Pradesh
Visakhapatnam
MoUs
Employment Opportunities
AP CRDA
Industrial Progress

More Telugu News