Raja Singh: జూబ్లీహిల్స్ ఫలితంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh Comments on Jubilee Hills Election Results
  • కాంగ్రెస్ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేసిందన్న రాజాసింగ్
  • బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని ఆరోపణ
  • ఈ ఓటమిపై బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న
  • కాంగ్రెస్ నాయకులను చూసి బీజేపీ నాయకులు నేర్చుకోవాలని సూచన
  • కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్‌లు బీజేపీ భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తే, బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని ఆయన అన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకే కొందరు బీజేపీ నాయకులు పనిచేశారని ఆరోపించారు. అందుకే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను చూసి బీజేపీ నాయకులు చాలా నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరి కారణంగా పార్టీ అధికారంలోకి రావడం లేదని, పైగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎదగనీయడం లేదని ఆరోపించారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని, కానీ పార్టీ పరిస్థితి చూసి బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నానని అన్నారు.
Raja Singh
Jubilee Hills
Telangana BJP
Bandi Sanjay
Kishan Reddy
Laxman

More Telugu News