Jasprit Bumrah: కోల్‌కతా టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియాదే పైచేయి

Jasprit Bumrah Leads Indias Dominance in Kolkata Test Day 1
  • కోల్ కతాలో భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో సఫారీలు 159 ఆలౌట్
  • బుమ్రాకు 5 వికెట్లు 
  • ఆట ముగిసేసమయానికి భారత్ స్కోరు 39-1
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుమ్రా (5/27) తన అద్భుతమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీ జట్టులో ఐడెన్ మార్క్‌రమ్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మార్కో యన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఆట ముగిసే సమయానికి రాహుల్ (13), సుందర్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 122 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు భారత బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించే అవకాశం ఉంది.
Jasprit Bumrah
India vs South Africa
Kolkata Test
Eden Gardens
Cricket
Mohammed Siraj
Kuldeep Yadav
Aiden Markram
KL Rahul
Washington Sundar

More Telugu News