Naveen Yadav: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మాగంటి సునీతపై నవీన్ యాదవ్ జయకేతనం

Congress Naveen Yadav Wins Jubilee Hills Election
  • 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఘన విజయం
  • తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ ఆధిపత్యం
  • ఈసీ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి చివరి వరకు నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు.

శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. లెక్కింపు ప్రక్రియలో ఏ దశలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్‌కు పోటీ ఇవ్వలేకపోయారు. రౌండ్ రౌండ్‌కు మెజార్టీని పెంచుకుంటూ నవీన్ యాదవ్ తన గెలుపును సులభతరం చేసుకున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ గెలుపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Naveen Yadav
Jubilee Hills
Telangana Elections
Maganti Sunitha
Congress Party
BRS Party
Revanth Reddy
Telangana Politics
Assembly Elections
Election Results

More Telugu News