Satish Kumar: తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్‌పై మృతదేహం

TTD Parakamani Case Key Figure Satish Kumar Found Dead
  • తాడిపత్రి రైల్వే ట్రాక్‌పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం
  • గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది సతీశ్ కుమారే
  • విచారణ వేళ ఆయన మృతి చెందడంపై పలు అనుమానాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్వో) సతీశ్‌ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై ఆయన విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ బృందం విచారిస్తుండగా, దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లను రవికుమార్‌ అనే వ్యక్తి దొంగిలించాడని ఆరోపిస్తూ అప్పటి ఏవీఎస్వోగా ఉన్న సతీశ్‌ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, అనూహ్యంగా సతీశ్‌ కుమార్ కోర్టులో ఆ కేసును రాజీ చేసుకున్నారు. కొందరు రాజకీయ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన రాజీకి అంగీకరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది. ప్రస్తుతం సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీశ్‌ కుమార్ రైల్వే ట్రాక్‌పై శవమై తేలడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పరకామణి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 
Satish Kumar
Tirumala
TTD
Parakamani case
Tadipatri
Andhra Pradesh
CID investigation
Railway track death
Corruption allegations
Ravi Shankar Ayyanar

More Telugu News