Masood Azhar: ఎర్రకోట ఉగ్రకుట్రలో కొత్త కోణం.. మసూద్ అజర్ ఫ్యామిలీతో లింకులు!

Masood Azhar Family Links Emerge in Red Fort Terror Plot
  • ఫరీదాబాద్ మాడ్యూల్ కీలక వ్యక్తికి మసూద్ అజర్ కుటుంబంతో సంబంధాలు
  • పుల్వామా సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్యతో షహీన్ టచ్‌లో ఉన్నట్టు గుర్తింపు
  • తెరపైకి జైషే మహ్మద్ మహిళా విభాగం 'జమాత్-ఉల్-మొమినాత్'
  • మసూద్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో మహిళా బ్రిగేడ్ల ఏర్పాటు
  • భారత్‌లో మహిళా ఉగ్రవాదుల నియామక బాధ్యతలు చూస్తున్న షాహీన్  
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి కుట్ర కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కీలక సభ్యురాలు షాహీన్ సయీద్‌కు, జైషే మహ్మద్ (జీఈఎం) ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పుల్వామా దాడి సూత్రధారి, జైషే కమాండర్ ఉమర్ ఫరూక్ భార్య అఫీరా బీబీతో షాహీన్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు వెల్లడైంది.

పుల్వామా సూత్రధారి భార్యే ఈ అఫీరా బీబీ
2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారి అయిన ఉమర్ ఫరూక్.. మసూద్ అజర్‌కు స్వయానా మేనల్లుడు. ఈ దాడి తర్వాత భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో ఉమర్ హతమయ్యాడు. అతడి భార్యే ఈ అఫీరా బీబీ. ప్రస్తుతం జైషే కొత్తగా ప్రారంభించిన మహిళా విభాగం 'జమాత్-ఉల్-మొమినాత్'లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఎర్రకోట దాడి కుట్రకు కొన్ని వారాల ముందే ఆమె ఈ విభాగంలోని అడ్వైజరీ కౌన్సిల్‌లో చేరినట్లు తెలిసింది. మసూద్ అజర్ సోదరి.. 1999 కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి యూసఫ్ అజర్ భార్య అయిన సాదియా అజర్‌తో కలిసి అఫీరా పనిచేస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో మహిళా ఉగ్రవాదుల నియామకమే లక్ష్యం
ఇటీవల భారత భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'లో జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం ధ్వంసమై మసూద్ కుటుంబం చెల్లాచెదురైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు జైషే మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మసూద్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో 'జమాత్-ఉల్-మొమినాత్' విభాగాన్ని ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విభాగంలో షాహీన్ సయీద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. భారత్‌లో కొత్తగా మహిళా విభాగాలను స్థాపించడం, స్థానికంగా మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కొత్త కోణంతో దర్యాప్తు సంస్థలు విచారణను మరింత వేగవంతం చేశాయి.
Masood Azhar
Red Fort terror plot
Jaish-e-Mohammed
Shahina Sayeed
Afira Bibi
Pulwama attack
Umar Farooq
India terror recruitment
Jamaat-ul-Mominat
Yusuf Azhar

More Telugu News