Peddireddy Ramachandra Reddy: భూ ఆక్రమణ వ్యవహారం... పెద్దిరెడ్డి ఫ్యామిలీపై కేసు నమోదు

Peddireddy Family Faces Case in Land Encroachment
  • మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ వాస్తవమేనన్న పీసీసీఎఫ్
  • ఏ1గా ఎంపీ మిథున్ రెడ్డి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు
  • ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
  • రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లినట్టు వెల్లడి
  • భూ కబ్జాలపై విచారణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
  • అటవీ భూముల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని మంత్రి పవన్ ఆదేశం
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పి.వి. చలపతిరావు సంచలన ప్రకటన చేశారు. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లను చేర్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల అటవీ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

మంగళంపేట అటవీ ప్రాంతంలో భూ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 1968 గెజిట్ ప్రకారం ఈ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలు ఉన్నప్పటికీ, దానికి ఆనుకుని ఉన్న 32.63 ఎకరాల అటవీ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ ఆక్రమణపై భారత న్యాయ సంహిత (BNS), ఏపీ అటవీ చట్టం 1967లోని పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పీవోఆర్) ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేసి, కోర్టుకు వివరాలు సమర్పించామని వివరించారు. ఈ కేసులో ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లను చేర్చినట్లు పేర్కొన్నారు.

ఆక్రమించుకున్న భూమికి చుట్టూ కంచె వేసి, అందులో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అక్రమంగా ఆదాయం పొందారని చలపతిరావు తెలిపారు. అంతేకాకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా బోర్ వెల్ తవ్వి, అటవీ వనరులను తీవ్రంగా దుర్వినియోగం చేశారన్నారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఆక్రమిత 32.63 ఎకరాలకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలను సమర్పించడంలో వారు విఫలమయ్యారని, పీవోఆర్ నెం.3/2025 ప్రకారం నిందితులకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

అటవీ భూములను ఆక్రమించిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పీసీసీఎఫ్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అటవీ భూముల వివరాలను పూర్తిస్థాయిలో సర్వే చేసి, ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్ సైట్లో ఉంచుతామని చలపతిరావు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా పారదర్శకతను పెంచి, భవిష్యత్తులో ఆక్రమణలకు తావు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.
Peddireddy Ramachandra Reddy
Chittoor district
Pulicherla
forest land encroachment
PCCF Chalapathi Rao
Peddireddy Mithun Reddy
Pawan Kalyan
Andhra Pradesh forest act

More Telugu News