Khawaja Asif: భారత్‌తో పాటు ఆ దేశంతో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Khawaja Asif Ready for War with India Pakistan Minister
  • భారత్, తాలిబన్లతో రెండు వైపులా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రకటన
  • రెండింటినీ ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నామని వ్యాఖ్య
  • ఈ యుద్ధంలో అల్లా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తాడన్న ఖవాజా ఆసిఫ్
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. తూర్పు సరిహద్దులో భారత్, పశ్చిమ సరిహద్దులో తాలిబన్లతో రెండు వైపులా యుద్ధానికి తాము సంసిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

"మేము రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. తూర్పు (భారతదేశం), పశ్చిమ సరిహద్దు (ఆఫ్ఘనిస్థాన్‌) దేశాలను రెండింటినీ ఎదుర్కోవడానికి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఈ యుద్ధంలో అల్లా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు" అని ఆయన పేర్కొన్నారు.

కాగా పాకిస్థాన్‌లో రెండు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లోని ఒక కోర్టు ఆవరణలో కారులో బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి బాంబు దాడికి తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ బాధ్యత వహించింది. అయితే, ఈ దాడి విషయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు.
Khawaja Asif
Pakistan
India
Afghanistan
War
Defense Minister Pakistan
Delhi Car Blast

More Telugu News