Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ

Chandrababu Naidu Secures Taiwan Investments in Andhra Pradesh
  • పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి సమక్షంలో తైవాన్ ప్రతినిధి బృందంతో ఎంవోయూలు
  • పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని కొనియాడిన తైవాన్ ప్రతినిధి బృందం
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు.

పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్‌లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృతంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.

తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో - తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది.

పాద రక్షల తయారీ కంపెనీ పౌ చెన్ గ్రూప్ ఫుట్ వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్‌కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీకండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు సహకరించాలని కోరింది. ఓర్వకల్లు సమీపంలోనే ఇ-జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చింది. 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్ధ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, కాథోడ్ యాక్టివ్ మెటిరియల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతిపాదించింది.

వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు- ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడు రీజియన్లను కలుపుతూ ఈ రహదారి మార్గాలు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులకు వివరించారు.

ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పాలసీలో భాగంగా ప్రోత్సాహకాలకు సంబంధించిన నిర్ణయాలు త్వరలోనే కేంద్రం విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. తైవాన్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని తయారు చేసేందుకు సిద్ధమని సీఎం వెల్లడించారు. తైవాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వ సహకారం బాగుందని తైవాన్ బృందం కొనియాడింది.

ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చ

ఆంధ్రప్రదేశ్‍‌లో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖపట్నంలోని CII భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా గురువారం భారతదేశంలోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి బార్టోలీకి వివరించారు.

కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి-ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకానిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏపీ-ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు-ఇటలీ రాయబారి బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి.
Chandrababu Naidu
Taiwan
Andhra Pradesh
Investments
Industrial Park
Electronic Vehicles

More Telugu News