పీఎఫ్ విత్ డ్రా చేస్తే పన్ను కట్టాలా.. నిబంధనలు ఏంచెబుతున్నాయంటే!
- పీఎఫ్ విత్ డ్రాను సులభతరం చేసిన కేంద్రం
- డ్రా చేసుకునే ఆప్షన్ల సంఖ్య పెంపు
- అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దంటున్న నిపుణులు
విత్ డ్రా చేసిన మొత్తంపై పన్ను ఎప్పుడంటే..
ఉద్యోగంలో చేరిన ఐదేళ్లలోపు పీఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఉద్యోగం మారిన సందర్భాలలో రెండు సంస్థల్లో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పాత సంస్థలో వినియోగించిన పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసిన సందర్భంలోనే ఈ రూల్ వర్తిస్తుంది. కొత్త ఖాతా తెరిస్తే మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారు. ఈపీఎఫ్ లో యజమాని వాటా కింద జమ అయిన మొత్తంతో పాటు డిపాజిట్ పై వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఆదాయాన్ని బట్టి పన్ను శ్లాబు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను శాఖకు పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే 34.60 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..
ఐదేళ్లకు మించిన ఈపీఎఫ్ ఖాతాల్లోని డిపాజిట్ మొత్తంలో రూ.1.50 లక్షల వరకు (పాత పన్ను విధానంలో) పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త పన్ను విధానంలో కేవలం యజమాని వాటాపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్ ఖాతాలోని నగదు నిల్వలు, మెచ్యూరిటీ సొమ్ము పూర్తిగా పన్ను రహితం.