Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్.. పేదరాలి సొంతింటి కలను నెరవేర్చిన డిప్యూటీ సీఎం

Pawan Kalyan Deputy CM Helps Woman Get New Home
  • ఏడాది క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం
  • పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మహిళకు నెరవేరిన సొంతింటి కల
  • ఇల్లు కట్టించుకోలేని దుస్థితిని గతేడాది పవన్‌కు వివరించిన కృష్ణవేణి
  • పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం
  • ప్రభుత్వ నిధులతో ఇల్లు నిర్మించి తాళాలు అందజేసిన కలెక్టర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ నిరుపేద మహిళ సొంతింటి కల నెరవేరింది. సరిగ్గా ఏడాది క్రితం ఆమెకు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కంకణాల కృష్ణవేణి అనే మహిళకు గత ప్రభుత్వ హయాంలో తాళ్లకోడులో ఇంటి స్థలం మంజూరైంది. అయితే, ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోలేని దుస్థితిలో ఆమె ఉండిపోయింది. దీంతో గతేడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్, తప్పకుండా ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా ఇచ్చారు.

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించి, ఆమెకు గృహ నిర్మాణంలో సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన పరిధిలోని నిధుల నుంచి రూ.1.50 లక్షలు, హౌసింగ్ కార్పొరేషన్ నిధులు రూ.1.80 లక్షలు కలిపి మొత్తం రూ.3.30 లక్షలతో కృష్ణవేణికి పక్కా గృహాన్ని నిర్మించారు.

నిన్న‌ కలెక్టర్ నాగరాణి స్వయంగా తాళ్లకోడు వెళ్లి, నూతన గృహం తాళాలను కృష్ణవేణికి అందజేశారు. తన సొంతింటి కల నెరవేరడంతో కృష్ణవేణి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఏడాది క్రితం పవన్ కల్యాణ్ గారికి నా కష్టాన్ని చెప్పుకున్నాను. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు ఇల్లు కట్టించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నా జీవితాంతం రుణపడి ఉంటాను" అని కృతజ్ఞతలు తెలియ‌జేశారు.
Pawan Kalyan
Pawan Kalyan Deputy CM
Andhra Pradesh Housing
West Godavari District
Akiveedu
Kankanal Krishna Veni
Housing for Poor
Janasena Party
Nagarani Collector

More Telugu News