Pawan Kalyan: నిశ్శబ్దంగా సేవ చేసే వీళ్లే నిజమైన దేశభక్తులు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Says Silent Servants are True Patriots
  • దేశ భద్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • నిఘా, భద్రతా దళాలే మన దేశానికి నిజమైన హీరోలని ప్రశంస
  • విజయనగరంలో ఐసిస్ ఉగ్రకుట్రను భగ్నం చేసిన తీరును గుర్తుచేసిన పవన్
  • దేశ భద్రతను ప్రాంతీయ పార్టీలు విస్మరించవద్దని కీలక వ్యాఖ్యలు
  • నకిలీ లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలు ప్రమాదకరమని హెచ్చరిక
  • ప్రతి పౌరుడూ అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమమని పిలుపు
దేశ భద్రత కేవలం కేంద్ర ప్రభుత్వానికో, దిల్లీలోని కొందరికో పరిమితమైన అంశం కాదని, గ్రామ పంచాయతీ నుంచి రాజధాని వరకు ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి గుర్తింపు ఆశించకుండా దేశాన్ని రక్షించే నిఘా, భద్రతా దళాలే నిజమైన హీరోలని ఆయన కొనియాడారు. ఢిల్లీ పేలుడు ఘటన, ఫరీదాబాద్ లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాల స్వాధీనం నేపథ్యంలో... దేశ భద్రత, అంతర్గత ముప్పులపై ఆయన తన సోషల్ మీడియా పోస్టులో కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

"ముందుగా మన దేశ భద్రతా, గూఢచార సంస్థలలో పనిచేస్తున్న వారికి నా హృదయపూర్వక వందనాలు. వారే మన నిజమైన హీరోలు, మనకు తెలియని తెర వెనుక యోధులు. ఈ దేశభక్తులు ఎలాంటి గుర్తింపునూ ఆశించకుండా, రేయింబవళ్లు నిశ్శబ్దంగా దేశానికి సేవ చేస్తున్నారు. వారి మౌన కృషే ఊహకందని పెను ప్రమాదాలను నివారిస్తూ, మన దేశ భద్రతను, శాంతిని కాపాడుతోంది. సామాన్య పౌరులుగా మనం ఊహించడానికి కూడా భయపడే ఎన్నో విపత్తులను వారు మొగ్గలోనే తుంచేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఒక్కసారి ఆలోచించండి. 2,900 కిలోల ఐఈడీల తయారీ ముడిసరుకు, దాచిపెట్టిన అసాల్ట్ రైఫిళ్లు, రైసిన్ అనే భయంకరమైన విష ప్రయోగం చేయాలన్న కుట్రలను మన ఏజెన్సీలు భగ్నం చేయకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? మన వీధుల్లోకి రాకముందే వారు నాశనం చేస్తున్న ఆ విలయానికి మనం వారికి సర్వదా రుణపడి ఉంటాం.

ఉగ్రవాద మూలాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. అవి మన సమాజం నడిబొడ్డుకు చేరుకుంటున్నాయి. ఇది ఎక్కడో దూరంగా ఉన్న సమస్య కాదు. ఇటీవలే, విజయనగరంలో అరెస్టులతో మొదలైన ఐసిస్ భావజాలంతో ముడిపడిన ఒక భయంకరమైన ఉగ్రకుట్రను ఎన్ఐఏ, ఇతర ఏజెన్సీలు విజయవంతంగా ఛేదించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడులు చేయాలన్న వారి పన్నాగాన్ని అడ్డుకున్నారు. నేటి కఠోర వాస్తవం ఏమిటంటే, ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే చిన్న పట్టణాలు, నిశ్శబ్ద పల్లెల నుంచే ఇప్పుడు భద్రతా ముప్పులు, ఉగ్రదాడులు పుట్టుకొస్తున్నాయి.

జాతీయ భద్రత అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన పని కాదు, అది ఢిల్లీలోని కార్యాలయాలకే పరిమితమైన అంశం అంతకన్నా కాదు. ఈ బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానిది, ప్రతి ప్రభుత్వ శాఖది, గ్రామ పంచాయతీ నుంచి రాజధాని వరకు ప్రతి స్థానిక సంస్థది. ప్రతి ఒక్కరికీ ఇందులో తిరుగులేని, ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ భద్రతను కేవలం జాతీయ పార్టీల అంశంగా భావించి పక్కన పెట్టడానికి వీల్లేదు. అది ప్రాంతంతో సంబంధం లేకుండా, భారతదేశంలోని ప్రతి రాజకీయ పార్టీ అజెండాలో అత్యంత ప్రాధాన్య అంశం కావాలి. దేశ భద్రతకు మించి ఏ రాజకీయమూ ఉండకూడదు.

మన వీధుల్లో, మన పరిసరాల్లో రాడికలైజేషన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కానీ, మనం చూసీచూడనట్లుగా కళ్లు మూసుకుంటున్నాం. ఈ పెను ముప్పును ఎదుర్కోవాలంటే ప్రతి సంస్థ ఒక రక్షణ దుర్గంలా మారాలి. ప్రతి కాలనీ, ప్రతి పాఠశాల, ప్రతి కళాశాల, ప్రతి విశ్వవిద్యాలయం, ప్రతి కార్యాలయం, ప్రతి వృత్తిపరమైన సంస్థ, ప్రతి మతపరమైన సంస్థ, దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ అప్రమత్తంగా ఉండాలి. నిరంతర నిఘా అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, అది ప్రతి భారత పౌరుడి ప్రాథమిక, ప్రథమ కర్తవ్యం. మనం ఏమరపాటుగా ఉంటే, చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

భారతదేశం కేవలం అత్యధిక జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ రోజు మనం ఒక కీలకమైన దశలో ఉన్నాం. బయటి శత్రువులతో మన వీర సైనికులు పోరాడగలరు, సరిహద్దులను కాపాడగలరు. కానీ, దేశాన్ని అంతర్గతంగా విచ్ఛిన్నం చేయడానికి నిరంతరం పనిచేస్తున్న శక్తుల నుంచి మనల్ని ఎవరు కాపాడాలి?

బూటకపు లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలు, జాతీయ సార్వభౌమత్వం కంటే భాషా, ప్రాంతీయ అహంకారాలను రెచ్చగొట్టడం వంటివి కేవలం రాజకీయ ఎత్తుగడలు కావు. అవి మన ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచేందుకు పన్నిన లోతైన కుట్రలు.

పౌరులు, ముఖ్యంగా యువత, కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు. మన శక్తులను, సమయాన్ని చిల్లర సమస్యలు, కృత్రిమంగా సృష్టించే ఆవేశాలతో వృథా చేసుకోవద్దు. మనం మతం, కులం, భాష, ప్రాంతీయ రాజకీయాల చుట్టూ కొట్టుకుంటుంటే, బయటి శక్తులు మన భారతీయ నాగరికతను, మన ఆత్మను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ గందరగోళాన్ని దాటి చూడండి, బాధ్యతగా మెలగండి.

భారతదేశాన్ని కాపాడాల్సిన, బలోపేతం చేయాల్సిన అంతిమ బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోండి - మొదట మనమందరం భారతీయులం, మన కర్తవ్యం ఎల్లప్పుడూ దేశం కోసమే... అంతే!" అంటూ పవన్ తన పోస్టులో స్పష్టం చేశారు.
Pawan Kalyan
Andhra Pradesh
National Security
Internal threats
ISIS
NIA
Terrorism
Radicalization
Vijayawada
IED attacks

More Telugu News