Narendra Modi: ఢిల్లీ పేలుడు ఘటన.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం

Narendra Modi chairs high level cabinet meeting on Delhi blast
  • ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా మౌనం పాటించిన కేంద్ర కేబినెట్
  • పేలుడు ఘటనను ఖండించిన కేంద్ర కేబినెట్
  • కిరాతక ఉగ్ర ఘాతుకంగా అభివర్ణించిన కేంద్ర కేబినెట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ ఉగ్ర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన కేంద్ర కేబినెట్, పేలుడు ఘటనను ఖండించింది. ఇది కిరాతక ఉగ్ర ఘాతుకంగా పేర్కొంది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది.

ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

సమీక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా ఆరేళ్లపాటు రూ. 25,060 కోట్లు కేటాయించనున్నారు. ఎగుమతుల ఎకో సిస్టమ్ బలోపేతానికి ఈ మిషన్‌ను తీసుకువచ్చారు. ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Narendra Modi
Delhi blast
Red Fort
Cabinet meeting
Amit Shah
Rajnath Singh

More Telugu News