Ambati Rambabu: గుంటూరులో ఉద్రిక్తత... పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం

Ambati Rambabu Clash With Police in Guntur Over Medical College Privatization Protest
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆందోళనలు
  • గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ర్యాలీకి అడ్డంకి
  • అంబటి, పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదం
  • సీఐ తీరుపై మండిపడిన అంబటి.. లోకేశ్ బంధువంటూ ఆరోపణ
  • ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ వై‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు, స్థానిక సీఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు, బుధవారం నాడు అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించారు. స్వామి థియేటర్ వద్దకు చేరుకోగానే, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని నిలువరించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకు మధ్య మాటామాటా పెరిగింది. సీఐ తనతో దురుసుగా ప్రవర్తిస్తూ, వేలు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి ఆరోపించారు. గతంలో కూడా ఇదే అధికారి తన పట్ల ఇలాగే ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు.

లోకేశ్ కోసమే పోలీసులు ఓవరాక్షన్: అంబటి

ఈ ఘటన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "మేం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పేదలకు విద్యను దూరం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి ఉద్యమిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం బడాబాబులకు కాలేజీలను కట్టబెట్టి లోకేశ్ జేబులు నింపుతున్నారు" అని అంబటి ఆరోపించారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. "లోకేశ్ మెప్పు పొందేందుకే కొందరు పోలీసులు ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారు. వారు పోలీస్ భాష మాట్లాడితే, మాకు ఆ భాష రాదా? పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు... లోకేశ్ బంధువు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ర్యాలీని అడ్డుకున్నారు. మమ్మల్ని అణిచివేయాలని, లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్ధం" అని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు తమ ఉద్యమం ఆగదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనతో గుంటూరులో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Ambati Rambabu
Guntur
YSRCP Protest
Medical Colleges Privatization
Andhra Pradesh Politics
Lokesh Nara
Pattabhipuram CI Venkateswarlu
Chandrababu Naidu
TDP Government
Political Tension

More Telugu News