Pawan Kalyan: మీకు రుణపడి ఉంటాం సర్.. పవన్ కానుకపై బాధితురాలి భావోద్వేగం

Pawan Kalyan Gifts Woman Injured During Visit
  • చిత్తూరు పర్యటనలో గాయపడిన మహిళ హేమావతి
  • బాధితురాలికి కొండపల్లి బొమ్మలు పంపిన డిప్యూటీ సీఎం
  • త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేకంగా లేఖ రాసిన జ‌న‌సేనాని
  • పవన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ తన సమస్యలు వివరించిన బాధితురాలు
  • రూ. 10 వేల ఆర్థిక సాయం, నెలసరి సరుకులు అందిస్తామని జనసేన ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చిత్తూరు పర్యటనలో గాయపడిన మహిళ పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు. ఇటీవల పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో హేమావతి అనే మహిళ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పవన్, ఆ మహిళ కోసం మంగళగిరి నుంచి ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మలను బహుమతిగా పంపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ లేఖను కూడా జతచేశారు. ఈ కానుకను, లేఖను జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్.. హేమావతికి అందజేశారు.

పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన హేమావతి
పవన్ కల్యాణ్ తనను గుర్తుపెట్టుకుని కానుక పంపడంపై హేమావతి సంతోషం వ్యక్తం చేశారు. "పవన్ కల్యాణ్ సర్‌కు నమస్కారం. తోపులాటలో అయిన చిన్న గాయాన్ని గుర్తుపెట్టుకుని పరామర్శించినందుకు ధన్యవాదాలు. నాలాంటి సామాన్యురాలిని గుర్తుంచుకుని బహుమతి పంపినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఇల్లు, ఫించన్ లేవు. దయచేసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను" అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇది తోపులాటలో జరిగిన గాయమే: జనసేన
ఈ ఘటనపై జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ నెల‌ 9న పవన్‌ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని, ఆ సమయంలో జరిగిన తోపులాటలో హేమావతికి స్వల్ప గాయమైందని తెలిపారు. ఈ చిన్న విషయాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

"ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ నాకు ఫోన్ చేసి బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడితే కాలికి ఫ్రాక్చర్ కాలేదని తెలిసింది. అయినా స్వయంగా వెళ్లి పరామర్శించాలని ఆయన ఆదేశించారు" అని హరిప్రసాద్ పేర్కొన్నారు. బాధితురాలికి జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్థిక సహాయంతో పాటు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన ప్రకటించారు.

కాగా, పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని కారు మహిళ కాలిపై నుంచి వెళ్లిందని, కనీసం పట్టించుకోకుండా పవన్ వెళ్లిపోయారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను జనసేన వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అది కేవలం జనసందోహం వల్ల జరిగిన తోపులాట మాత్రమేనని స్పష్టం చేశాయి.
Pawan Kalyan
HemaVathi
Chittoor
Janasena
AP Deputy CM
Elephant Training Center
Kondapalli Toys
Palamaneru
YCP Allegations
Financial Assistance

More Telugu News