Narendra Modi: ఏపీ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

Narendra Modi to Visit Andhra Pradesh for Sathya Sai Centenary Celebrations
  • ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లాకు ప్రధాని రాక
  • సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న మోదీ
  • ఈ నెల 22న సత్యసాయి వర్సిటీలో స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి
  • ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తిరుచానూరు సందర్శన  
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి రానున్న ప్రధాని.. వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. 

మరోవైపు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23న జరిగే స్నాతకోత్సవంలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొంటారు.

హిల్ వ్యూ స్టేడియంలో ఉత్సవాలు..
సత్యసాయి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు పది రోజుల పాటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జయంతి ఉత్సవాలను హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల ఏర్పాట్లపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఎమ్మెస్‌ రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్‌జైన్‌ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీతో కలిసి మంత్రి అనగాని ప్రసాద్ పరిశీలించారు.

తిరుచానూరుకు రాష్ట్రపతి ముర్ము..
ఈ నెల 17 నుంచి 25 తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పరిసరాలతో పాటు పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టీటీడీ సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు.
Narendra Modi
AP Tour
Andhra Pradesh
Puttaparthi
Sathya Sai
Chandrababu Naidu
Droupadi Murmu
Tiruchanoor
Radhakrishnan
AP Politics

More Telugu News