Satya Kumar Yadav: ఏపీలో 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పూర్తి: మంత్రి సత్యకుమార్ వెల్లడి

Satya Kumar Yadav AP Completes Cancer Screening for 39 Lakh People
  • ఆరు నెలల్లో మిగిలిన వారికి పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దంచేశామన్న మంత్రి సత్యకుమార్
  • పరీక్షల్లో వేల సంఖ్యలో క్యాన్సర్ అనుమానిత లక్షణాల గుర్తింపు 
  • మహిళల కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలతో అవగాహన కార్యక్రమం చేపడుతున్నామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నియంత్రణ, నివారణ కార్యక్రమం 4.0లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రానున్న ఆరు నెలల్లో మిగిలిన వారందరికీ ఈ పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
 
మంత్రి అందించిన వివరాల ప్రకారం.. మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, పురుషులకు నోటి క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న వారిలో 9,963 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్, 26,639 మందికి నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరోసారి పరీక్షించి, అవసరమైన వారిని జిల్లా బోధనాసుపత్రులకు పంపుతున్నారు. అక్కడ ఆంకాలజిస్టులు తుది నిర్ధారణ చేసి చికిత్స ప్రారంభిస్తారు. ఇందుకోసం బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా '222' నంబర్‌తో ఓపీ గదిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.
 
ఈసారి స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు గతంలో ఉన్న 210 ప్రశ్నలను 28కి కుదించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్స్, సెర్ఫ్ పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అందించిన సూచనలను కూడా ఈ విధివిధానాల ఖరారులో పరిగణనలోకి తీసుకున్నారు.
 
ముఖ్యంగా, మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షల పట్ల ఉన్న సంకోచాన్ని తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. "మీ కుటుంబం కోసం ఒక చిన్న అడుగు వేయండి. ఆరోగ్య కేంద్రానికి రండి" అనే నినాదంతో ప్రత్యేక ఆహ్వాన పత్రికలను ముద్రించి, సర్వే సమయంలో మహిళలకు అందజేస్తున్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని ఈ పత్రికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
Satya Kumar Yadav
Andhra Pradesh cancer screening
AP cancer detection
Non-communicable diseases NCD

More Telugu News