Turkish Military Plane Crash: గాల్లోనే గింగిరాలు కొడుతూ నేలకూలిన తుర్కియే సైనిక విమానం.. 20 మంది మృతి

Turkish Military Plane Crash 20 Killed in Georgia
  • జార్జియాలో కుప్పకూలిన తుర్కియే సైనిక కార్గో విమానం
  • ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 20 మంది మృతి
  • అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా ఘటన
  • నేలకూలడానికి ముందు విమానం గింగిరాలు కొట్టినట్లు వీడియో ఫుటేజ్
తుర్కియేకి చెందిన సైనిక కార్గో విమానం తూర్పు జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది సహా 20 మంది మరణించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "అజర్‌బైజాన్ నుంచి బయలుదేరిన మా సీ-130 సైనిక కార్గో విమానం జార్జియా-అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది. విమాన సిబ్బందితో కలిపి మొత్తం 20 మంది ఈ విమానంలో ఉన్నారు" అని తెలిపింది.

ప్రమాదానికి ముందు విమానం గాల్లోనే గింగిరాలు కొడుతూ వేగంగా నేల వైపు దూసుకొచ్చి, భూమిని ఢీకొట్టగానే భారీ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు అజర్‌బైజాన్ మీడియాలో ప్రసారమయ్యాయి. ప్రమాద స్థలంలో విమాన శకలాలు తగలబడుతూ, దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్న వీడియోలు కూడా వెలువడ్డాయి.

ఈ ఘటనపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారిని అమరవీరులుగా అభివర్ణించారు. విమాన శకలాలను చేరేందుకు జార్జియా అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు వెల్లడించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కూడా తుర్కియే అధ్యక్షుడికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సందేశం పోస్ట్ చేశారు. సహాయక చర్యల గురించి తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, జార్జియా విదేశాంగ మంత్రి మకా బోచోరిష్విలితో ఫోన్‌లో మాట్లాడారు.

జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. అజర్‌బైజాన్ సరిహద్దుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని సిగ్నాఘి ప్రాంతంలో విమానం కూలిపోయిందని తెలిపింది. జార్జియా గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాలకే విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, ఎలాంటి ప్రమాద సంకేతాలు జారీ చేయలేదని దేశ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏజెన్సీ ‘సకేరోనావిగాట్సియా’ పేర్కొంది. ఈ సీ-130 హెర్క్యులస్ విమానాన్ని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుంది.
Turkish Military Plane Crash
Turkey military cargo plane
Azerbaijan
Recep Tayyip Erdogan
Ilham Aliyev
Georgia
C-130 Hercules
Hakan Fidan
Maka Bochorishvili

More Telugu News