Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Quarx Technosoft to Establish IT Campus in Visakhapatnam
  • క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
  • 4 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • ఏపీ ఐటీ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు
  • మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలోగా పూర్తి చేయాలని పేర్కొన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో కొత్త ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ సంస్థ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.115 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం ఎకరా కోటి రూపాయల చొప్పున మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్‌ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విభాగాలతో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద కంపెనీకి అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి రెండేళ్లలోపు తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని, మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీటీఎస్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్లను ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో విశాఖ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
Quarx Technosoft
Visakhapatnam
Vizag IT Campus
Andhra Pradesh IT
IT sector jobs
Kapuluppada
AI ML
Cyber Security
Katamaneni Bhaskar
AP IT Policy

More Telugu News