Chandrababu Naidu: మౌలానా అబుల్ కలామ్ అజాద్ స్పూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Inspired by Maulana Azad for Education Reforms in AP
  • 2025-26 బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి రూ.రూ.5,434 కోట్లు కేటాయించామన్న సీఎం చంద్రబాబు
  • మైనారిటీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి 
  • ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేసిన సీఎం
మైనారిటీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "దేశభక్తికి చిరునామా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారు. దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. 1951లో మొదటి ఐఐటీని స్థాపించారు. ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశాం. ఒకప్పుడు మైనారిటీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగళూరు, ముంబై వెళ్లవలసి వచ్చేది. హైదరాబాద్‌లో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి, అక్కడి నుంచి విమానంలో మక్కాకు పంపాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలతో చాలా మంది ముస్లింలు లబ్ధి పొందారు" అని అన్నారు.

సంక్షేమంలో మైనారిటీలకు ప్రాధాన్యత

2025-26 బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ.5,434 కోట్లు కేటాయించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేశాం. మైనారిటీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాం. డీఎస్సీ ద్వారా 175 మందిని ఉర్దూ ఉపాధ్యాయులుగా నియమించాం. పీఎం వికాస్ పథకం కింద రూ.11 కోట్లతో 1,500 మందికి నైపుణ్య శిక్షణ ప్రారంభించాం. రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి మైనారిటీ ఆడపిల్లలను ఇంటర్ వరకు ఉచితంగా చదివిస్తున్నాం. ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికుల కోసం ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వెయ్యికి పైగా మసీదులు, చర్చిలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పునరుద్ధరణకు రూ.200 కోట్లు మంజూరు చేస్తాం. వక్ఫ్ ఆస్తులను రక్షిస్తున్నాం. అర్హత కలిగిన ఇమామ్ లందరినీ ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. నూర్ బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం" అని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. నంద్యాల జిల్లాలో ముస్లిం ధార్మిక సమ్మేళనం ఇస్తెమా కార్యక్రమానికి రూ.కోటీ 75 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి ముఖ్యమంత్రి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మౌలానా ఆజాద్ జాతీయ పురస్కారం కింద రూ.2.5 లక్షల నగదును అవార్డు గ్రహీతకు అందించారు. అలాగే అబ్దుల్ హక్ అవార్డు కింద 1.25 లక్షలు, రైజింగ్ స్పోర్ట్స్ పర్సన్ విభాగంలో నలుగురికి లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సీఎం అందించారు. దీంతో పాటు జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన 8 మందికి రూ.25 వేల చొప్పున సీఎం అందజేశారు. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా ఐదుగురు, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మంది ఎంపికవ్వగా వారందరికీ రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన 58 మందికి రూ.5 వేలు చొప్పున సీఎం అందించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరయ్యారు. 
Chandrababu Naidu
AP CM
Minority Welfare
Andhra Pradesh
Maulana Abul Kalam Azad
Urdu Academy
Muslims
Scholarships
Education
Super Six

More Telugu News