Parakamani Case: పరకామణి కేసు: రంగంలోకి దిగిన సీఐడీ డీజీ.. అధికారులపై ప్రశ్నల వర్షం

Dharma Reddy Faces CID Inquiry in Tirumala Parakamani Theft Case
  • పరకామణి చోరీ కేసులో ముమ్మరమైన సీఐడీ దర్యాప్తు
  • సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ
  • అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు
  • కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా
  • నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా అని ప్రశ్న
తిరుమల పరకామణిలో జరిగిన సంచలన చోరీ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేరుగా రంగంలోకి దిగి విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఆయన నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో పలువురు అధికారులను విచారించింది. అప్పటి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావుతో పాటు తిరుమల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇన్‌చార్జి చంద్ర, ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు, టీటీడీ గార్డు రామచంద్రను వేర్వేరుగా ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది.

విచారణలో భాగంగా డిప్యూటీ ఈవో మల్లికార్జునరావును సీఐడీ డీజీ పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు స‌మాచారం. "నిందితుడు రవికుమార్ వద్ద 72 డాలర్లు పట్టుకుంటే, ఎఫ్‌ఐఆర్‌లో కేవలం 9 డాలర్లు మాత్రమే ఎందుకు చూపించారు? మిగిలిన కరెన్సీ ఏమైంది? పంచనామా ఎందుకు నిర్వహించలేదు?" అని డీజీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. "ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చిన పెద్దలు ఎవరు? నాటి అధికార పార్టీ నేతల నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా? డిప్యూటీ ఈవో హోదాలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు స‌మాచారం.

టీటీడీకి డిప్యుటేషన్‌పై ఎలా వచ్చారు? ఇందులో మాజీ ఈవో ధర్మారెడ్డి పాత్ర ఏమైనా ఉందా? అని కూడా సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం తిరుమల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇన్‌చార్జి చంద్రను ఫుటేజీల గురించి ప్రశ్నించారు. "చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయా? వాటిని డిలీట్ చేశారా? ఒకవేళ ఉంటే ఎవరికి అప్పగించారు?" అని డీజీ ప్రశ్నించగా, తాను ఫుటేజీలో చోరీని గమనించి వెంటనే వీజీవోకు సమాచారం ఇచ్చానని చంద్ర బదులిచ్చినట్లు తెలిసింది. ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు, గార్డు రామచంద్రను కూడా అధికారులు వేర్వేరుగా విచారించారు.

విచారణకు హాజరుకానున్న మాజీ ఈవో ధర్మారెడ్డి
ఈ కేసు విచారణలో భాగంగా కీలక అధికారిగా భావిస్తున్న టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఈరోజు సీఐడీ డీజీ ఎదుట హాజరుకానున్నారు. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Parakamani Case
Dharma Reddy
Tirumala
Parakamani
TTD
Tirupati
Currency theft case
CCTV footage
Mallikarjuna Rao
CID investigation
Padmavathi Guest House

More Telugu News