India Pakistan relations: పాక్ ఆరోపణలు నిరాధారం.. తీవ్రంగా ఖండించిన భారత్

India Strongly Denies Pakistans Baseless Allegations
  • తమ దేశంలో పేలుళ్ల వెనుక భారత్ ఉందని ఆరోపించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • ఈ ఆరోపణలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదిర్ జైస్వాల్  
  • ఉగ్రవాదాన్ని భారత్ ఎన్నడూ ప్రోత్సహించదని వ్యాఖ్య 
  • పొరుగు దేశంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
పాకిస్థాన్‌లో జరిగిన వరుస పేలుళ్ల వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, తమ దేశంలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ నాయకత్వం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని గట్టిగా బదులిచ్చింది.

ఇటీవల ఇస్లామాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ఈ దాడుల వెనుక భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎన్నడూ ప్రోత్సహించదని, పొరుగు దేశంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ నాయకత్వం చేస్తున్న నిరాధార, అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దేశంలో జరుగుతున్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం, అధికార దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్‌పై నిందలు మోపుతున్నారు. పాకిస్థాన్ ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించడం కొత్తేమీ కాదు. వాస్తవ పరిస్థితులు ఏంటో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసు. పాక్ ఎన్ని వితండవాదనలు చేసినా ఎవరూ మోసపోరు’’ అని ఆయన వివరించారు. పాకిస్థాన్‌లో నెలకొన్న అధికార దాహమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, దానికి ఇతరులను బాధ్యులను చేయడం సరికాదని భారత్ హితవు పలికింది. 
India Pakistan relations
Pakistan blasts
Shehbaz Sharif
Ranadhir Jaiswal
India foreign affairs
Pakistan terrorism allegations
Islamabad blasts
India denies allegations
internal conflict
cross-border terrorism

More Telugu News