Bihar Elections: బీహార్‌లో రికార్డు పోలింగ్.. 70 ఏళ్ల‌ తర్వాత ఇదే అత్యధికం!

Bihar Elections Record Polling After 70 Years
  • ప్రశాంతంగా ముగిసిన బీహార్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు
  • రికార్డు స్థాయిలో 68.79 శాతం పోలింగ్ నమోదు
  • పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలు
  • రెండు దశల్లో కలిపి 70 ఏళ్ల‌ తర్వాత అత్యధిక పోలింగ్
  • నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 20 ఏళ్ల తర్వాత విజయవంతంగా పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో రికార్డు స్థాయిలో 68.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వినోద్ సింగ్ గుంజియాల్ వెల్లడించారు. ఇంకా 2,000 పోలింగ్ కేంద్రాల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉందని, దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

రెండు దశల్లో కలిపి సగటున 66.90 శాతం పోలింగ్ నమోదైందని, ఇది గత అసెంబ్లీ ఎన్నికల కంటే 9.6 శాతం అధికమని ఆయన వివరించారు. 1951-52 ఎన్నికల తర్వాత బీహార్‌లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు దశల్లో కలిపి పురుషుల పోలింగ్ 62.8 శాతంగా ఉండగా, మహిళల పోలింగ్ 71.60 శాతంగా నమోదైంది.

20 ఏళ్ల తర్వాత నక్సల్ గ్రామాల్లో ఓటింగ్
ఈసారి ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లు, సాంకేతికత వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో దశాబ్దాల తర్వాత పోలింగ్ జరగడం చరిత్రాత్మకం. గతంలో భద్రతా కారణాలతో పోలింగ్ కేంద్రాలను తరలించేవారని, కానీ ఈసారి ఒక్క బూత్‌ను కూడా తరలించలేదని అధికారులు తెలిపారు. గయా జిల్లాలోని చకర్బంధా, జమూయీ జిల్లాలోని చోర్‍మారా వంటి గ్రామాల్లో 20 ఏళ్ల తర్వాత ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారని ఏడీజీ కుందన్ కృష్ణన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో 70 శాతం వరకు పోలింగ్ జరగడం విశేషం.

దేశంలోనే తొలిసారి 100 శాతం వెబ్‌కాస్టింగ్
రెండో దశ ఎన్నికల కోసం 122 నియోజకవర్గాల్లో 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి దేశంలోనే తొలిసారిగా 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించామని సీఈఓ గుంజియాల్ తెలిపారు. ప్రతి బూత్ లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా వినియోగించారు. ఎన్నికల ప్రక్రియలో మొత్తం 1,625 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.127 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండో దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక సాంకేతికత వినియోగంతో రెండో దశ పోలింగ్ విజయవంతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలు లేకుండా ముగిసింది.
Bihar Elections
Bihar Assembly Elections
Vinod Singh Gunjiyal
Bihar CEO
Naxal Areas Polling
Webcasting Polling
Bihar Polling Percentage
Election Commission of India
Bihar Voting
Record Polling

More Telugu News