Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu Fires at Pawan Kalyan Over Sanatana Dharma Comments
  • తిరుపతి, సింహాచలంలో భక్తులు చనిపోయినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారన్న అంబటి
  • టీడీపీ నేత వద్ద లక్షల కిలోల గోమాంసం దొరికితే ఎందుకు స్పందించలేదని ప్రశ్న
  • వైసీపీ ర్యాలీలకు ముందు చంద్రబాబు చెప్పినట్టే పవన్ ట్వీట్లు చేస్తున్నారా? అంటూ ఆగ్రహం
  • సనాతన ధర్మ యోధుడినని చెప్పుకోవడం వెనుక ఉన్న నిజ స్వరూపం ఇదేనా? అంటూ ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఆయన పూర్తిగా చంద్రబాబు చేతిలో రాజకీయ కీలుబొమ్మగా మారారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అనుసరిస్తూ, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు.

"ఓ మై గాడ్... నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. సనాతన ధర్మ యోధుడినని చెప్పుకునే పవన్ కల్యాణ్ గారు ఎట్టకేలకు తన సుదీర్ఘ నిద్ర నుంచి బయటకు వచ్చారు. కానీ ఆయన వచ్చింది న్యాయం కోసమో, ధర్మం కోసమో కాదు. కేవలం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాయించే ప్రచార డప్పుకు అనుగుణంగా డ్యాన్స్ చేయడానికి మాత్రమే! ఇది చూస్తుంటే నాకు నవ్వొస్తోంది.

నేను సూటిగా అడుగుతున్నాను. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయినప్పుడు ఈ ధర్మ పరిరక్షకుడు ఎక్కడికి వెళ్లారు? సింహాచలంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఈయన దైవాగ్రహం ఏమైంది? కాశీబుగ్గలో తొమ్మిది మంది అమాయకులు మరణించినప్పుడు ఈ మహాయోధుడు ఎందుకు కనిపించలేదు? ఒక్కటంటే ఒక్క సంఘటన జరిగిన చోటుకు ఆయన వెళ్లలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించలేదు. ఒక ప్రజా నాయకుడి నుంచి కనీసం ఆశించే మానవత్వం కూడా చూపించకుండా, బాధిత కుటుంబాలను కలవకుండా ఏం సాధించారు?

ఇక అసలు విషయానికి వద్దాం. విశాఖపట్నంలో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన కోల్డ్ స్టోరేజ్‌లో 1,89,000 కిలోల గోమాంసం పట్టుబడినప్పుడు, సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పే పవన్ కల్యాణ్ గారు మళ్ళీ మాయమైపోయారు. ఆ ఘటనపై ఆయనలో ఎలాంటి ఆగ్రహం లేదు, కనీసం ఖండన లేదు. కేవలం నిశ్శబ్దం, కపటత్వం మాత్రమే కనిపించాయి.

కానీ ఈ రోజు, సరిగ్గా నవంబర్ 12న వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన ర్యాలీలకు ముందు, పవన్ గారు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వెంటనే ‘ఎక్స్’ లోకి వచ్చి చంద్రబాబు అందించిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రిప్ట్‌ను వల్లించడం మొదలుపెట్టారు.

పవన్ గారూ, దీన్ని ధర్మం అనరు. ఇది నిస్సిగ్గుగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారి చేస్తున్న రాజకీయ నాటకం. ఇది మీ నిబద్ధతను, మీ సిద్ధాంతాలను మీరే అపహాస్యం చేసుకోవడం కాదా? జనం అన్నీ గమనిస్తున్నారన్న విషయం మీకు గుర్తుందా?" అంటూ అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Ambati Rambabu
Pawan Kalyan
YS Jagan
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP
YSRCP
Sanatana Dharma
Vizag
Cold Storage

More Telugu News