Donald Trump: విదేశీ విద్యార్థులు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిది: డొనాల్డ్ ట్రంప్

Donald Trump Says Foreign Students Good for US Businesses
  • అమెరికాలో చదువుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న ట్రంప్
  • ఇది దేశ ఉన్నత విద్యావ్యవస్థకు మద్దతుగా ఉంటుందన్న ట్రంప్
  • విదేశీ విద్యార్థులను సగానికి తగ్గిస్తే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన
విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి రావడం తమ దేశంలోని వ్యాపారాలకు మేలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాల విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇది దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించాలనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. అలా చేస్తే అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని, అది జరగకుండా చూస్తానని ఆయన అన్నారు. ఇతర దేశాల విద్యార్థులు రావడం మంచి పరిణామమని ఆయన అభివర్ణించారు. తాను ప్రపంచంతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు.

అమెరికాకు వచ్చేవారి సంఖ్యను సగానికి తగ్గిస్తే కొందరికి సంతోషం కలగవచ్చు కానీ కళాశాలలకు మాత్రం వ్యాపారం తగ్గిపోతుందని ఆయన అన్నారు. దేశీయ విద్యార్థుల కంటే విదేశీ విద్యార్థులే అధికంగా ఫీజులు చెల్లిస్తున్నారని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికాకు వచ్చే విద్యార్థులకు సోషల్ మీడియా వెట్టింగ్‌ (సోషల్ మీడియా ఖాతాల పరిశీలన)ను తప్పనిసరి చేస్తూ అమెరికా ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Donald Trump
US Foreign Students
America Education
US Economy
International Students

More Telugu News