Maganti Sunitha: కొద్ది సమయమే ఉంది... జూబ్లీహిల్స్ ఓటర్లకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజ్ఞప్తి

Maganti Sunitha Appeals to Jubilee Hills Voters
  • దయచేసి ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి
  • కాంగ్రెస్ వారికి భయపడవద్దని, ధైర్యంగా వచ్చి ఓటేయాలని సూచించిన సునీత
  • నవ్వినా, ఏడ్చినా విమర్శలు చేస్తున్నారని ఆవేదన
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజ్ఞప్తి చేశారు. "ఎన్నికలు ముగియడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. దయచేసి ఓటర్లంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజలెవరూ కాంగ్రెస్ పార్టీకి భయపడవద్దని, ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటువంటి రౌడీయిజాన్ని గతంలో ఏ ఎన్నికల్లోనూ చూడలేదని ఆమె అన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు వేస్తేనే ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. తన భర్త గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇలాంటి దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్‌కు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను పరిశీలించాలని కోరారు. పలు ఓటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఏం పని చేసినా విమర్శలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనిషిగా బాధ కలిగినప్పుడు బాధను వ్యక్తం చేస్తే, సంతోషంగా ఉన్నప్పుడు నవ్వితే విమర్శిస్తున్నారని ఆమె అన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నా చర్యలను అందరూ గమనిస్తున్నారని ఆమె తెలిపారు.
Maganti Sunitha
Jubilee Hills
BRS
Telangana Elections 2023
Voting
Congress Party
Gopinath
Election Commission
Telangana Politics

More Telugu News