Chandrababu: ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu Launches 50 MSME Parks in Andhra Pradesh
  • కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్‌గా శ్రీకారం
  • రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం
  • పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం
  • చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని వెల్లడి
  • గత పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారని విమర్శ
ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న రూ.25,256 కోట్ల పెట్టుబడులతో కూడిన 25 పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈరోజు 329 ఎకరాల్లో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారుల వంటి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తోంది. కేవలం ఆలోచనతో వస్తే చాలు, సులభంగా పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చు" అని ఆయన భరోసా ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడం నేటి ఆధునిక విధానమని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమని అన్నారు. ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి.. పారిశ్రామిక వేత్తలు పారిపోయారు
గత పాలకుల హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని, పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. "17 నెలల క్రితం సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో పాలన చేపట్టాం. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తామని చెప్పాం. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పిన హామీని నిలబెట్టుకుంటున్నాం" అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మొత్తం 87 ప్రదేశాల్లో ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయని తెలిపారు.
Chandrababu
Andhra Pradesh
AP Industries
MSME Parks
Industrial Development
Investments AP
Peda Eerlapadu
Kanigiri
AP Economy
Job Creation

More Telugu News