Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు

Pakistan Cricketer Naseem Shah house shooting incident
  • పాక్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంటిపై గుర్తుతెలియని దుండగుల దాడి
  • ఆయన నివాసం గేటుపై కాల్పులు జరిపి పరారైన దుండగులు
  • శ్రీలంకతో వన్డే సిరీస్‌లో నసీమ్ షా యథావిధిగా పాల్గొంటున్నట్లు వెల్ల‌డి 
  • ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు 
  • నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నసీమ్ తండ్రికి పోలీసుల హామీ
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంట్లో కలకలం రేగింది. లోయర్ దిర్‌లోని ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దుండగులు ఇంటి గేటుపై కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఈ దాడిలో నసీమ్ షా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు నసీమ్ షా దూరమవుతాడని ఊహాగానాలు వచ్చినా, వాటికి తెరపడింది. ఈ దాడి తన షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం చూపదని, అతను జట్టుతోనే కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. రావల్పిండి వేదికగా మంగళవారం నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో నసీమ్ షా యథావిధిగా పాల్గొంటాడు.

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నసీమ్ షా తండ్రి పోలీసు ఉన్నతాధికారితో సమావేశం కాగా, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు.

నసీమ్ షాకు ఇద్దరు తమ్ముళ్లు హునైన్, ఉబైద్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్లే. అయితే, ఘటన జరిగినప్పుడు వారు ఇంట్లో ఉన్నారా? లేదా? అనేది తెలియరాలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక, జింబాబ్వేతో కూడిన టీ20 ట్రై-సిరీస్‌లో కూడా నసీమ్ షా పాల్గొననున్నాడు.
Naseem Shah
Pakistan cricket
Naseem Shah shooting
Lower Dir
Pakistan fast bowler
Sri Lanka ODI series
Rawalpindi
Hunain Shah
Ubaid Shah
Cricket news

More Telugu News