Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా?

CSK Birthday Wish Fuels Sanju Samson Trade Rumors
  • సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • సీఎస్‌కేలోకి సంజూ బదిలీపై ఊపందుకున్న ఊహాగానాలు
  • రాజస్థాన్ రాయల్స్‌తో దశాబ్దానికి పైగా అనుబంధం ఉన్న సంజూ
  • జట్టును వీడాలన్న తన నిర్ణయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపిన కెప్టెన్
  • రాబోయే 48 గంటల్లో డీల్ పూర్తి కావొచ్చని నివేదికలు
ఐపీఎల్ వర్గాల్లో సంచలనం రేపుతున్న మెగా ట్రేడ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ 30వ పుట్టినరోజు సందర్భంగా సీఎస్‌కే అధికారికంగా శుభాకాంక్షలు తెలుపడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సంజూను సీఎస్‌కేలోకి తీసుకుని, బదులుగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసే డీల్ దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా ఈ బదిలీకి అంగీకరించారని, రాబోయే 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం శాంసన్ పుట్టినరోజున సీఎస్‌కే తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో 'సంజూ.. నీకు మరింత శక్తి చేకూరాలి! సూపర్ బర్త్‌డే శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ట్రేడ్ వార్తలకు దాదాపు అధికారిక ముద్ర పడినట్లయింది.

సంజూ శాంసన్ దాదాపు దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. 2013లో ఆర్‌ఆర్‌లో చేరిన అతను, 11 సీజన్ల పాటు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. 2021లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి, 2022లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. 2008 తర్వాత ఆర్‌ఆర్ ఫైనల్స్‌కు చేరడం అదే తొలిసారి.

కెప్టెన్‌గా 67 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన సంజూ, 2024 సీజన్‌లో 531 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అయితే, 2025 సీజన్ మధ్యలో గాయపడటంతో అతను టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ ప్రదర్శన దారుణంగా పడిపోయి, పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. ఈ సీజన్ తర్వాత మార్పు కోరుకుంటున్నట్టు సంజూ స్వయంగా ఆర్‌ఆర్ యాజమాన్యానికి తెలియజేయడంతో వారు ఇతర ఫ్రాంచైజీలతో ట్రేడింగ్ అవకాశాలను పరిశీలించడం మొదలుపెట్టారు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు (4027), అత్యధిక 50+ స్కోర్లు (25), అత్యధిక క్యాచ్‌లు (149) పట్టిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డుల్లో నిలిచాడు. అలాంటి కీలక ఆటగాడు ఇప్పుడు చెన్నై పసుపు జెర్సీలో కనిపించనుండటం ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Sanju Samson
Sanju Samson CSK
Chennai Super Kings
Ravindra Jadeja
Sam Curran
Rajasthan Royals
IPL Trade
IPL 2025
Cricket
IPL News

More Telugu News