AP Government: ఇక సొంతూరి నుంచే ఐటీ ఉద్యోగం చేసుకోవచ్చు.. 'వర్క్‌స్పేస్' పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

Chandrababu workspace policy enables IT jobs in native AP towns
  • సొంత ఊర్లలోనే ఐటీ ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం
  • ప్రతి మండల కేంద్రంలో వర్క్‌స్పేస్‌ల ఏర్పాటుకు నిర్ణయం
  • హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు అన్ని ఆఫీస్ సదుపాయాలు
  • ఏర్పాటు చేసేవారికి అద్దె, పెట్టుబడిపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు
  • కనీసం 610 మంది పనిచేసేలా వర్క్‌స్పేస్ ఉండాలన్న నిబంధన
ఐటీ ఉద్యోగులు ఇకపై తమ సొంత ఊరి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన 'వర్క్‌స్పేస్' విధానానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి సోమవారం ఆమోదముద్ర వేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన ఈ పాలసీ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నైపుణ్యం ఉన్నప్పటికీ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఐటీ నిపుణులకు హైస్పీడ్ ఇంటర్నెట్, ఆఫీస్ వాతావరణం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రతి మండలంలోనూ 'వర్క్‌స్పేస్' స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నగరాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఈ పాలసీలో భాగంగా వర్క్‌స్పేస్‌లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రభుత్వ భవనాల్లో వర్క్‌స్పేస్ ఏర్పాటు చేస్తే, నామమాత్రపు అద్దెను ఐదేళ్లపాటు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసేవారికి ఏటా రూ.6 లక్షలకు మించకుండా 50 శాతం అద్దెను చెల్లిస్తుంది. అలాగే 'ఎర్లీ బర్డ్' పాలసీ కింద ముందుగా వచ్చేవారికి పెట్టుబడిపై 60 శాతం వరకు, గరిష్ఠంగా రూ.15 లక్షల రాయితీ ఇవ్వనుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఛార్జీలలో కూడా 50 శాతం భరించనుంది.

మండల స్థాయిలో ఏర్పాటు చేసే వర్క్‌స్పేస్ కనీసం 1000 చదరపు గజాల విస్తీర్ణంలో 610 మంది పనిచేసే సామర్థ్యంతో ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఇందులో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, బిజినెస్ మీటింగ్‌ల కోసం ప్రత్యేక గదులు, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్లతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించాలని పాలసీలో పేర్కొన్నారు.
AP Government
Chandrababu Naidu
Andhra Pradesh
workspace policy
IT jobs
rural development
IT professionals
work from home
incentives
broadband internet

More Telugu News