Chandrababu Naidu: ముందు అవగాహన... ఆ తర్వాతే చలానా: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Focuses on Awareness Before Challans
  • ఆర్టీజీఎస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో చంద్రబాబు సమీక్ష 
  • ట్రాఫిక్ చలానాలకు ముందు అవగాహన కల్పించాలని సూచన
  • నిబంధనలు మీరితే ముందుగా ఫోన్‌కు మెసేజ్ పంపాలని దిశానిర్దేశం
రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పద్ధతులకు స్వస్తి పలకాలని, చలానాలు విధించడానికి ముందు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాల వంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల అంశంపై సీఎం కీలక సూచనలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారికి, సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి ముందుగా దాని ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. భారీగా చలానాలు విధించాలన్న అధికారుల ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. 

నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్లకు ముందుగా హెచ్చరిక మెసేజ్‌లు పంపాలని, ఆ తర్వాత కూడా వారు మారకపోతేనే చలానాలు విధించాలని స్పష్టం చేశారు. దీనివల్ల, తాను తప్పు చేసినందుకే జరిమానా పడిందన్న భావన ప్రజల్లో కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం కోసం కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ప్రమాదాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారాల కోసం వారం రోజుల్లోగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు (SOP) సిద్ధం చేయాలని ఆదేశించారు.

గుంతల్లేని రోడ్లే నా ప్రాధాన్యత

పాలనలో తన ప్రాధాన్యతలేమిటో ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టంగా వివరించారు. "రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నీటి నిర్వహణ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. ఇవే నా ప్రధాన లక్ష్యాలు. అధికారులు ఈ అంశాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలి" అని నిర్దేశించారు. రాష్ట్రంలో రోడ్లు ఇప్పటికీ అధ్వానంగా ఉన్నాయని ఫీడ్‌బ్యాక్ వస్తోందని, ఈ పరిస్థితిని తక్షణం చక్కదిద్దాలని ఆదేశించారు. 

గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కారణం ఏదైనా, ప్రజలకు గుంతల్లేని రోడ్లను అందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రైనేజీల నిర్వహణను కూడా మెరుగుపరిచి, నీరు నిలిచిపోయే సమస్య లేకుండా చూడాలన్నారు.

పనితీరు మెరుగుపడాలి.. అవినీతి ఉండొద్దు

ప్రభుత్వం అందించే పౌరసేవలపై కూడా సీఎం సమీక్షించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సేవలు, పారిశుద్ధ్యం, రేషన్ పంపిణీ, దీపం-2.0 వంటి పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ల సేవలు గతంతో పోలిస్తే కొంత మెరుగైనప్పటికీ, కొందరు అధికారుల తీరుపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందని, దానిని సరిచేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. మరో రెండున్నర నెలల్లో రిజిస్ట్రేషన్ సేవలలో తాను ఆశించిన మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించి, వాటిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
traffic rules
road safety
challans
awareness programs
road accidents
drainage system
unemployment
job melas

More Telugu News