Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

Chandrababu Naidu Reviews Amaravati Visakhapatnam Economic Region
  • విశాఖ కేంద్రంగా భారీ ఎకనామిక్ రీజియన్
  • రాష్ట్రాన్ని గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు వెల్లడి
  • శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఈ ప్రాంతం విస్తరణ
  • ఆర్ధిక మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చ
  • సమావేశానికి హాజరైన సీఎస్, పలువురు ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్రానికి ఒక ప్రధాన గ్రోత్ హబ్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

ఈ సమీక్షలో భాగంగా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న జిల్లాలను కలుపుకొని 'సమగ్ర విశాఖ ఎకనామిక్ రీజియన్‌'ను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాంతంలోని సహజ వనరులు, మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్ధిక ప్రగతికి బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ లక్ష్య సాధన కోసం ఒక పటిష్టమైన 'ఎకనామిక్ మాస్టర్ ప్లాన్' రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రణాళికలో ఆయా జిల్లాల ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిరాభివృద్ధి సాధించడం వంటి కీలక అంశాలు ఉండాలని ఆయన సూచించారు.

ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో పాటు ఆర్ధిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు తమ విభాగాల పరంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
Chandrababu Naidu
Amaravati Visakhapatnam Economic Region
Andhra Pradesh Economy
Visakhapatnam Growth Hub
AP Economic Development
Vizag Economic Region
Srikakulam Konaseema
AP Investments
Economic Master Plan

More Telugu News