Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్

Sri Bharat Slams YCP Leaders for Obstructing Investments in AP
  • విధ్వంసం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీ చేశారన్న శ్రీభరత్
  • పెట్టుబడుల సదస్సు వేళ వైసీపీ ర్యాలీలా? అంటూ ఆగ్రహం
  • తప్పు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరిక
ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినా వైసీపీ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, అభివృద్ధి అంటే వారికి తెలియదని విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీ చేశారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావడం, రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ కు, ఆయన పార్టీ నేతలకు అస్సలు ఇష్టం లేదని ఆరోపించారు.

విశాఖలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన 'యూనిటీ మార్చ్'‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మంచి చేసేందుకు ప్రపంచస్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తుంటే, అదే సమయంలో వైసీపీ ర్యాలీలు చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. పేదలను ఎప్పటికీ పేదరికంలోనే ఉంచాలన్నదే వైసీపీ సిద్ధాంతమని, అందుకే తమ హయాంలో పెట్టుబడిదారులను భయపెట్టి పంపించేశారని మండిపడ్డారు.

"ర్యాలీల పేరుతో పెట్టుబడుల సదస్సును పక్కదోవ పట్టించి, విశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. పిల్లల భవిష్యత్తు ముఖ్యమో, స్వార్థ రాజకీయాలు ముఖ్యమో ప్రజలు గమనించాలి. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది" అని శ్రీభరత్ హెచ్చరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో రూ.9.8 లక్షల కోట్ల విలువైన 410కి పైగా అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయని తెలిపారు.

రుషికొండపై అనవసరంగా ఖర్చు చేసిన డబ్బుతో ఉత్తరాంధ్రలో పలు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి ఉండవచ్చని శ్రీభరత్ అభిప్రాయపడ్డారు. హత్యలు చేసిన వారికి మంత్రి పదవులు, అసభ్యంగా మాట్లాడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జగన్ పాలనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. గంజాయి కేసుల్లో ఉన్నవారిని జైలుకు వెళ్లి పరామర్శించిన ఘనత కూడా జగన్‌దేనని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే మంత్రివర్గం రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసి, యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని శ్రీభరత్ స్పష్టం చేశారు. 
Sri Bharat
Visakhapatnam
TDP
AP investments
YS Jagan
Andhra Pradesh
Investment summit
Rally
Political criticism
Uttarandhra

More Telugu News