Sanchar Saathi: సిమ్ కార్డుల విషయంలో సరికొత్త మోసం.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

Sanchar Saathi New Sim Card Fraud Alert
  • సైబర్ నేరస్థులతో జట్టుకట్టి కొంతమంది వ్యాపారుల అక్రమాలు
  • ఆధార్ కోసం వేలిముద్రలు తీసుకుంటూ మోసం
  • మరో సిమ్ యాక్టివేట్ చేసి సైబర్ నేరస్థులకు చేరవేత
కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో సిమ్ కార్డు సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళుతుంది. ఇక ఆ సిమ్ కార్డుతో జరిగే మోసాలు మీ మెడకు చుట్టుకుంటాయి. ఈ తరహా మోసాలకు పాల్పడుతూ ఇటీవల ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.
 
ఆధార్ వేలిముద్రలు తీసుకుంటూ..
కొత్త సిమ్‌కార్డును యాక్టివేట్ చేయాలంటే ఆధార్ కార్డు వివరాలు, వేలిముద్రలు ఇవ్వాలనే విషయం తెలిసిందే. సరిగ్గా మోసం ఇక్కడే జరుగుతోంది. వేలిముద్రలు, ఐరిస్‌ సేకరించే సమయంలో స్కానింగ్‌ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు చేస్తారు. తద్వారా ఒకేసారి రెండు సిమ్ లను యాక్టివేట్ చేస్తున్నారు. ఒక సిమ్ మీ చేతుల్లోకి, మరో సిమ్ కార్డు సైబర్ నేరస్థుల ముఠా వద్దకు చేరుతోంది.

ఎలా అడ్డుకోవచ్చంటే..
సిమ్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://www.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దానిపై క్లిక్‌ చేయాలి. ‘నో మొబైల్‌ కనెక్షన్స్‌ ఇన్‌ యువర్‌ నేమ్‌ (know mobile connections in your name)’ పై క్లిక్‌ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరుతో నమోదైన సిమ్‌కార్డు నెంబర్లు కనిపిస్తాయి. ఆ నెంబర్లను మీరు ఇంకా వాడుతుంటే సరే.. అందులో మీరు ఎప్పుడూ వాడని నెంబర్ కనిపించినా, గతంలో వాడి పక్కన పడేసిన నెంబర్ ఉన్నా అప్రమత్తం కావాల్సిందే. ఆ నెంబర్ల పక్కన కనిపించే ‘నాట్ మై నంబర్’ ‘నాట్ రిక్వైర్డ్‌’ ఆప్షన్లపై క్లిక్ చేయడం ద్వారా మీ పేరుతో సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.
Sanchar Saathi
Sim card fraud
Aadhar
Cyber crime
Mobile connection
Sanchar Saathi app
ఆధార్ వేలిముద్రలు
సైబర్ నేరస్థులు
సిమ్ కార్డులు

More Telugu News