Gold Rate: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. రూ.1.22 లక్షలు దాటిన 10 గ్రాముల ప‌సిడి

Gold and silver prices up by 2 pc over positive global cues
  • ఈరోజు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • ఎంసీఎక్స్‌లో రూ.1.22 లక్షలు దాటిన 10 గ్రాముల బంగారం
  • కిలో వెండి ధర రూ.1.50 లక్షల పైకి చేరిక
  • అమెరికాలో వడ్డీ రేట్ల కోత అంచనాలతో పెరుగుదల
  • అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలతో పసిడికి డిమాండ్
బంగారం, వెండి ధరలు ఇవాళ‌ భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్ మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చాయి. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధర 1.16 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,22,468కి చేరింది. అదేవిధంగా వెండి ధర 1.99 శాతం వృద్ధితో కిలోకు రూ.1,50,666 వద్ద ట్రేడ్ అయింది.

అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పెరుగుతున్న ఆందోళనలు, వచ్చే నెలలో వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. మెహతా ఈక్విటీస్‌కు చెందిన కమొడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రీ ప్రకారం గత వారం మొత్తం ధరలలో తీవ్ర ఒడుదొడుకులు కనిపించినా, అమెరికాలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడటం, ప్రభుత్వ షట్‌డౌన్‌పై నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు తిరిగి కోలుకున్నాయి.

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ రికార్డు స్థాయికి చేరడం ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలను మరింత పెంచిందని, దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నారని ఆయన వివరించారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడటం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కార‌ణ‌మైంది.

ఇదిలాఉంటే.. ముడి చమురు ధరలు కూడా ఈరోజు పుంజుకున్నాయి. బ్యారెల్ డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 60 డాలర్ల మార్కును దాటింది. ఒపెక్, ఐఈఏ నుంచి వెలువడనున్న నివేదికల కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. అయితే, ఒపెక్ దేశాలు ఉత్పత్తి పరిమితులను సడలించడం, అమెరికా ఉత్పత్తిని పెంచడం వంటి కారణాలతో సరఫరా మిగులుపై అంచనాలు మార్కెట్‌ను మిశ్రమంగా ఉంచుతున్నాయి.
Gold Rate
Gold Price Today
Silver Rate
MCX
Commodity Market
Rupee
Rahul Kalantri
US Federal Reserve
Interest Rates
Crude Oil Prices

More Telugu News