Parappana Agrahara Jail: బెంగళూరు జైలులో ఖైదీల మందు పార్టీ.. వైరల్ గా మారిన వీడియో

Parappana Agrahara Jail Prisoners Party Video Goes Viral
  • మొన్న సెల్ ఫోన్ వాడుతున్న వీడియో వెలుగులోకి..
  • ప్రభుత్వం విచారణకు ఆదేశించిన మరుసటి రోజే మందు పార్టీ వీడియో
  • పరప్పన జైలులో ఖైదీలకు రాచమర్యాదలు
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే ఈ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్న వీడియో ఒకటి బయటపడడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ మరుసటి రోజే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఖైదీలు ఏకంగా మద్యం పార్టీ చేసుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా గడుపుతూ కనిపించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అత్యాచారం, హత్యలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలకు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కూడా ఇదే జైలులో ఉండగా.. అప్పట్లో అతడికి జైలు అధికారులు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలు ఆవరణలో కొంతమంది ఖైదీలతో దర్శన్ బాతాఖానీ వేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

రెండు రోజుల క్రితం వైరల్ అయిన వీడియోలో ఖైదీలు సెల్ ఫోన్ వాడుతుండడం కనిపించింది. యువకులను ఉగ్రవాదంవైపు ఆకర్షించి, టెర్రరిస్టులుగా మార్చుతున్నాడనే ఆరోపణలో జైలుపాలైన ఐఎస్ రిక్రూటర్ కు జైలు అధికారులు ఓ టీవీతో పాటు రెండు ఫోన్లు కూడా అందుబాటులో ఉంచారని ఆరోపణలు వినిపించాయి. మరికొందరు ఖైదీలు కూడా ఫోన్లో మాట్లాడుతుండడం వీడియోలో కనిపించింది. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో కొంతమంది ఖైదీలు డ్యాన్సులు చేస్తుండడం కనిపిస్తోంది. ఆ గదిలో ఓ టేబుల్ పై మద్యం సీసాలు, డిస్పోజబుల్ గ్లాసులో మద్యం, చిప్స్ వంటివి కనిపించడంతో పరప్పన అగ్రహార జైలు అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Parappana Agrahara Jail
Bangalore Jail
Karnataka Jail
Prison Party
Jail Video
Prison Cell Phones
Darshan Kannada Actor
Jail Corruption
Prison Security Lapse

More Telugu News