Ahmed Mohiuddin Sayed: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇంట్లోనే సైనైడ్ కన్నా ప్రమాదకర రసాయనం తయారీ!

Hyderabad Terror Plot Gujarat ATS Arrests ISIS Sympathizers
  • హైదరాబాద్ కేంద్రంగా ఐసిస్ ఉగ్రకుట్ర బట్టబయలు
  • ఇంట్లోనే రైసిన్ అనే విష రసాయనం తయారు చేసిన డాక్టర్
  • హైదరాబాద్ వైద్యుడి సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్
  • దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు నిందితుల ప్లాన్
  • ఒంటరితనంతో ఐసిస్ వైపు ఆకర్షితుడైన మొహియుద్దీన్
  • నగరంలో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక సంబంధాలపై ఆరా
హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడే.. తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి, సైనైడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైన ‘రైసిన్’ అనే విష రసాయనాన్ని తయారు చేయడం కలకలం రేపుతోంది. ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న ముగ్గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేయగా, వారిలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35) కీలకపాత్ర పోషించినట్లు తేలింది.

మొహియుద్దీన్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లను అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్, సలీంఖాన్‌లు దిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసం కోసం రెక్కీ నిర్వహించారని, పాకిస్థాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సేకరించారని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరంతా, రైసిన్ ఉపయోగించి దేశంలో పెను విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ పేర్కొంది.

రాజేంద్రనగర్‌లోని ఫోర్ట్‌వ్యూ కాలనీలో నివసించే డాక్టర్ మొహియుద్దీన్, 35 ఏళ్లు వచ్చినా వివాహం కాకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐసిస్ వైపు ఆకర్షితుడై, ఆన్‌లైన్ ద్వారా ఉగ్రవాద సానుభూతిపరులతో సంబంధాలు పెంచుకున్నాడు. ఇంట్లోని గదిలోనే ఆముదం గింజల వ్యర్థాల నుంచి రైసిన్ తయారు చేస్తుండగా, అతడి ప్రవర్తనపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అది చాలా విలువైన రసాయనమని, అమ్మితే డబ్బులొస్తాయని వారిని నమ్మించాడు. తరచూ కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలకు కూడా వెళ్లివస్తుండేవాడు.

మొహియుద్దీన్ అరెస్ట్‌తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, సోమవారం అతడి నివాసంలో తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. నగరంలో మొహియుద్దీన్‌కు ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇటీవల విజయనగరం, లాలాగూడ ప్రాంతాల్లో ఉగ్ర లింకులు బయటపడిన నేపథ్యంలో, తాజా ఘటనతో రాజధాని మరోసారి ఉలిక్కిపడింది.
Ahmed Mohiuddin Sayed
Hyderabad terror plot
Gujarat ATS
ISIS sympathizers
Ricin production
Rajendra Nagar
Dr Ahmed Mohiuddin
Chemical weapon
Cyberabad police
Terrorism

More Telugu News