Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ విజేత పాకిస్థాన్.. హార్దిక్ పాండ్యా స్టైల్‌లో సెలబ్రేషన్!

Muhammad Shahzad Celebrates Pakistans Hong Kong Sixes Win in Hardik Pandya Style
  • ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్ గెలుచుకున్న పాకిస్థాన్
  • ఫైనల్లో కువైట్‌ను 43 పరుగుల తేడాతో చిత్తు చేసిన పాక్
  • ట్రోఫీతో హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్‌ను అనుకరించిన ముహమ్మద్ షాజాద్
  • ఈ టోర్నీలో భారత్ చేతిలో మాత్రమే ఓటమిపాలైన పాకిస్థాన్
  • పాక్‌పై గెలిచిన భారత్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి
హాంకాంగ్ సిక్సెస్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కువైట్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈ విజయం కన్నా పాకిస్థాన్ ఆటగాడు ముహమ్మద్ షాజాద్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రోఫీతో ఇచ్చిన పోజును షాజాద్ అనుకరించడం వైరల్ అయింది.

ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (11 బంతుల్లో 52), అబ్దుల్ సమద్ (13 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్‌లతో 135/3 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కువైట్ 92/6 స్కోరుకే పరిమితమైంది. దీంతో పాకిస్థాన్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

విజయం అనంతరం ట్రోఫీ పక్కన నిల్చుని, హార్దిక్ పాండ్యా లాగే భుజాలు ఎగరేస్తూ షాజాద్ ఫొటో దిగాడు. "హాంకాంగ్ సిక్సెస్‌కు సరదా ముగింపు. ఎప్పటిలాగే మా పని మేము చేశాం" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను 'ఎక్స్‌'లో పోస్ట్ చేశాడు. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ విజయంతో పాకిస్థాన్.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా (5 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి, టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా నిలిచింది. ఫైనల్‌కు ముందు పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను, సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది.

ఆసక్తికరంగా ఈ టోర్నీలో పాకిస్థాన్ ఓడిపోయింది కేవలం ఒక్క మ్యాచ్‌లోనే. అది కూడా దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని భారత జట్టు చేతిలో. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ ఆ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, పాక్‌పై గెలిచిన ఊపును టీమిండియా కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి టోర్నీని నిరాశగా ముగించింది.
Hong Kong Sixes
Muhammad Shahzad
Pakistan
Hardik Pandya
Cricket
T20 World Cup
Abbas Afridi
Dinesh Karthik
Kuwait
Cricket Tournament

More Telugu News