Satya Kumar: ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త వైద్యులు.. 227 మంది స్పెషలిస్టులకు పోస్టింగ్‌లు

Satya Kumar Announces New Doctor Postings in Government Hospitals
  • ప్రభుత్వ ఆసుపత్రులలో 227 మంది స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం
  • 142 సెకండరీ ఆసుపత్రులకు కొత్త వైద్యుల కేటాయింపు
  • పీజీ పూర్తి చేసిన ఇన్‌సర్వీస్ వైద్యులకు పోస్టింగ్‌లు
  • వైద్యుల కొరత తీర్చేందుకే ఈ చర్యలన్న మంత్రి సత్యకుమార్
  • వివిధ విభాగాల్లో స్పెషలిస్టులకు కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు
  • త్వరలో సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లోనూ మరిన్ని నియామకాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీజీ విద్యను పూర్తి చేసుకున్న 227 మంది వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆసుపత్రులలో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

ఇన్‌సర్వీస్ కోటాలో 12 వేర్వేరు విభాగాల్లో పీజీ పూర్తి చేసిన ఈ వైద్యులను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు. వీరిలో 33 ఏరియా ఆసుపత్రులలో 60 మంది, ఏడు జిల్లా ఆసుపత్రులలో 10 మంది, రెండు ఎంసీహెచ్ ఆసుపత్రులలో ఇద్దరు స్పెషలిస్టులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అత్యధికంగా గూడూరు ఏరియా ఆసుపత్రికి నలుగురు స్పెషలిస్టులను కేటాయించారు. వీరిలో చిన్నపిల్లల వైద్యుడు, రేడియాలజిస్ట్, చర్మవ్యాధి నిపుణుడు, పాథాలజిస్ట్ ఉన్నారు.

నియమితులైన 227 మందిలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో 35 మంది చొప్పున, జనరల్ సర్జరీలో 30 మంది, మత్తు వైద్యులు 26 మంది, చిన్నపిల్లల వైద్య నిపుణులు 25 మంది, ఎముకల వైద్యులు 18 మంది, రేడియాలజిస్టులు 17 మంది, కంటి, ఈఎన్‌టీ వైద్య నిపుణులు కూడా ఉన్నారు. 2022-23లో ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరిన 257 మంది పీహెచ్‌సీ వైద్యులు ఇటీవల తమ కోర్సులు పూర్తి చేశారు. వారిలో 227 మందిని సెకండరీ ఆసుపత్రులలో నియమించగా, ఖాళీలు లేకపోవడంతో మిగిలిన 30 మందికి డీఎంఈ పరిధిలోని ఆసుపత్రులలో ట్యూటర్లుగా అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

ఈ నియామకాలతో పాటు త్వరలోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 155 మంది, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 155 మంది స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరతారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ పోస్టింగ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్‌బాబు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. పద్మావతి మంత్రికి వివరించారు.


Satya Kumar
Government Hospitals
Specialist Doctors
Doctor Postings
Healthcare
Telangana Health
Secondary Hospitals
Medical Recruitment
Health Services
Public Health

More Telugu News