BR Naidu: జగన్ నిఘా పెట్టారు.. శ్యామలరావు సహకరించలేదు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu Says Former EO Shamala Rao Did Not Cooperate
  • గత ప్రభుత్వ హయాంలో తనపై రెక్కీ చేయించారన్న బీఆర్ నాయుడు
  • కరుణాకర్ రెడ్డికి ఓ మాజీ న్యాయమూర్తి అండగా నిలుస్తున్నారని వెల్లడి
  • మాజీ ఈవో శ్యామలరావు సహకరించకపోవడంతో 10 నెలలు నష్టపోయానని వివరణ
  • భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు... మాజీ ముఖ్యమంత్రి జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో జగన్ తనపై నిఘా పెట్టించి, రెక్కీ కూడా నిర్వహించారని ఆయన ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో తన కదలికలపై నిఘా పెట్టేందుకు 10-15 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని నియమించారని బీఆర్ నాయుడు తెలిపారు. "నా కదలికల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు నన్ను హెచ్చరించారు. మీపై రెక్కీ జరిగింది, బయటి వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలియజేశామని" ఆయన అన్నారు

కరుణాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీకి కరుణాకర్ రెడ్డి ఒక చీడలా దాపురించారని, ఆయన హయాంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. "తిరుపతిలో డ్రైనేజీ, రోడ్లు వంటి సమస్యలను వదిలేసి, కేవలం టీటీడీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఉనికి కోసమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు" అని విమర్శించారు.

సిమ్స్ ఆసుపత్రిలోని నాలుగు మెడికల్ షాపులను తన బినామీలకు నెలకు రూ. 30 వేలు-40 వేల నామమాత్రపు అద్దెకు కట్టబెట్టారని, అదే షాపులకు ఇప్పుడు టెండర్లు నిర్వహిస్తే నెలకు రూ. 23 లక్షలు, రూ. 36 లక్షల చొప్పున ఆదాయం వస్తోందని తెలిపారు. తిరుమలలోని ఓ రెస్టారెంట్‌ను ఖాళీ చేయకుండా కోర్టులో స్టే తెచ్చుకోవడానికి కరుణాకర్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఓ మాజీ న్యాయాధికారి సహాయం తీసుకున్నారని, ఇది చాలా దారుణమని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ఈవో సహకరించలేదు
గతంలో ఈవోగా పనిచేసిన శ్యామలరావు తనకు ఏమాత్రం సహకరించలేదని, ఆయన వల్ల తాను 10 నెలల విలువైన సమయాన్ని కోల్పోయానని బీఆర్ నాయుడు అన్నారు. "అన్యమత ఉద్యోగులను తొలగించడం, ఏఐ టెక్నాలజీతో గంటలోపే దర్శనం కల్పించడం వంటి సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే అధికారులు అడ్డుపడ్డారు. బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే ఈవో పని అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా ఆయన పట్టించుకోలేదు" అని నాయుడు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈవోగా వచ్చిన సింఘాల్ చాలా నిజాయతీపరుడని, ఆయన సారథ్యంలో  త్వరలోనే సంస్కరణలు కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు బోర్డు తీర్మానం చేశామని, త్వరలో ప్రభుత్వానికి పంపుతామని, త్వరలోనే వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే తన లక్ష్యమని, బోర్డు సభ్యులందరూ తనకు పూర్తిగా సహకరిస్తున్నారని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
BR Naidu
TTD
Tirumala
Jagan Mohan Reddy
Karunakar Reddy
TTD Chairman
Andhra Pradesh Politics
Tirupati
Shamala Rao
Corruption Allegations

More Telugu News