Nara Lokesh: ఆ టీచర్‌కు హ్యాట్సాఫ్.. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Praises Teacher Sheikh Firoz Bashas Dedication
  • పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న షేక్ ఫిరోజ్ బాషా  
  • పిల్లలకు డిజిటల్ ప్రింటింగ్‌లా చేతిరాత నేర్పిస్తున్నారని ప్రశంస
  • టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి మార్పే కోరుకుంటున్నానని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అంకితభావాన్ని, బోధనా నైపుణ్యాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ భాషా సేవలను కొనియాడారు. విద్యార్థులకు ఆయన అందిస్తున్న విద్య, నేర్పిస్తున్న అందమైన చేతిరాత ఎంతో ఆదర్శంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
 
ఫిరోజ్ భాషా ప్రతిరోజూ ఉదయం అందరికంటే ముందుగా పాఠశాలకు రావడం, సాయంత్రం అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు తరగతులు తీసుకోవడం వంటి నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని లోకేశ్ తన ట్వీట్‌లో తెలిపారు. "మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్ డిజిటల్ ప్రింటింగ్‌లా అందంగా ఉంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మీకు హృదయపూర్వక అభినందనలు," అని పేర్కొన్నారు.
 
విద్యార్థుల్లో సబ్జెక్టుల పట్ల ఉన్న భయాలను పోగొట్టేందుకు ఫిరోజ్ భాషా వారితో కలిసిపోయి ఆటపాటలతో విద్యాబోధన చేయడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని మంత్రి అన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి చేరడం గొప్ప విషయమని అభినందించారు.
 
ప్రభుత్వ పాఠశాలల్లో తాను ఇలాంటి మార్పునే ఆశిస్తున్నానని నారా లోకేశ్ స్పష్టం చేశారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తన శక్తికి మించి కృషి చేస్తున్న ఫిరోజ్ భాషాతో పాటు, ఆయనకు సహకరిస్తున్న తోటి ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. తరగతి గదిలో విద్యార్ధులకు రైటింగ్ స్కిల్స్ నేర్పుతున్న వీడియోను నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
Nara Lokesh
Sheikh Firoz Basha
AP Education Minister
Puduguralla
Tummala Cheruvu
Government School Teacher
Handwriting Skills
Education
Andhra Pradesh
School Enrollment

More Telugu News