Delhi Pollution: పడిపోయిన గాలి నాణ్యత ప్రమాణాలు.. రెడ్ జోన్‌లోకి ఢిల్లీ

Delhi Pollution Levels Drop into Red Zone
  • పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత 400 దాటినట్లు వెల్లడి
  • పలు ప్రాంతాలు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడి
  • చర్యలకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత 400 (గాలి నాణ్యత సూచిక) దాటింది. శీతాకాలం ఆరంభమవ్వడంతో గాలి నాణ్యత ప్రమాణాలు మరింతగా పడిపోయాయని, పలు ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 400 దాటగా, గ్రేటర్ నోయిడాలో గాలి నాణ్యత 354, ఘజియాబాద్‌లో 339గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు శనివారం సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యతను లెక్కించింది. నగరంలోని 38 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ బోర్డు కాలుష్య తీవ్రతను పరిశీలించింది. శనివారం నమోదైన ఏక్యూఐని పరిశీలించగా వజీపూర్‌లో 420, బెరారిలో 418, వివేక్ విహార్‌లో 406, నెహ్రూ నార్‌లో 404, అలీపూర్‌లో 402 పాయింట్లు దాటినట్టు బోర్డు గుర్తించింది. ఈ ప్రాంతాలన్నీ అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నాయని బోర్డుకు చెందిన సమీర్ యాప్ ఆందోళన వెలిబుచ్చింది.

గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతుండటంతో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చర్యలకు ఉపక్రమించారు. వాహనాల రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వ కార్యాలయాల వేళలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం తర్వాత కార్యాలయాల వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటాయని వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయాల పని వేళలను ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు.
Delhi Pollution
Air Quality Index Delhi
Delhi AQI
Air Pollution India
NCR Pollution
Pollution Control Board

More Telugu News